calender_icon.png 11 July, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ధర్మచక్ర ప్రవర్తన మహోత్సవం

11-07-2025 12:00:00 AM

నాగార్జునసాగర్: జూలై 10 : నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధ వనంలో సిద్ధార్థుడు బుద్దునిగా మారిన తర్వాత ఆషాడ పౌర్ణమి రోజున తన పూర్వ శిష్యులకి ఇచ్చే మొదటి ఉపన్యాసాన్ని పురస్కరించుకొని ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవం వేడుకలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ కార్య మానికి ముఖ్యఅతిథిగా హాజరైన కుందూరు జానారెడ్డి బుద్ధవనంలోని బుద్ధ చరిత వనములో ఉన్న బుద్ధపాదాల వద్ద స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సిద్ధార్థుని పాత్రధారి, రామచంద్ర పాత్రధారి బాలీవుడ్ నటుడు  గగన్ మాలిక్, వరల్ బ్యాంక్ కన్సల్టెంట్ రవి బంకర్ లతో కలిసి పుష్పాంజలి ఘటించి వందనం సమర్పించారు.

అనంతరం చారుసిన్హా ఐపీఎస్ అధికారి బహుకరించిన బుద్ధగయ నుండి తెచ్చిన బోధి మొక్కను బుద్ధ వనములోని ధ్యానవనములో మాజీ మంత్రి జానారెడ్డి, స్థానిక శాసనసభ్యులు కుందూరు, జయవీర్ రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, బాలీవుడ్ నటులు గగన్ మాలిక్  లతో కలిసి నాటారు. అనంతరం మహా స్తూపం లోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించి బౌద్ధ సాంప్రదాయ చాoటింగ్ ( ప్రార్థన  )చేశారు.

అటు తర్వాత మహా స్తూపం లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ గౌతమ బుద్ధుని గొప్పతనాన్ని,అతని సాధారణ జీవితాన్ని, జ్ఞానోదయం పొందిన తర్వాత త్రీ శరణాలు, చతుర ఆర్య సత్యాలు, పంచశీల, అష్టాంగ మార్గం ద్వారా మన బుద్ధిని వికసింప చేసుకొని దమ్మ జీవితాన్ని గడుపుతూ సంఘజీవిగా సమానత్వ సంఘాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు.

నాగార్జునసాగర్ శాసనసభ్యులకు జయ వీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో పేరు పొందుతున్న బుద్ధవనాన్ని తెలంగాణ ప్రాంతంలోని నాగార్జునసాగర్ లో ఏర్పాటు చేయటానికి కుందూరు జానారెడ్డి కృషియే కారణం అని గుర్తు చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బుద్ధవనం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు ఏవైనా బుద్ధవనములాంటి ప్రదేశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు.

బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బుద్ధవనంతో పాటు సాగర్ జలాశయంలో ఉన్న చాకలి గట్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, దానితోపాటు సాగర్ జలాశయం లో ఐలాండ్ పైన 150 అడుగుల బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ బాలీవుడ్ నటులు గగన్ మాలిక్ మాట్లాడుతూ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచ దేశాల బౌద్ధ కేంద్రాలతో బుద్ధ వనాన్ని సమన్వయం చేయడానికి కృషి చేస్తామన్నారు.

వరల్ బ్యాంకు కన్సల్టెంట్ రవి బంకర్ మాట్లాడుతూ నార్త్ ఇండియా నుండి బుద్ధవనానికి పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రపంచస్థాయి బౌద్ధ కేంద్రాలను బుద్ధ వనములో నెలకొల్పడానికి సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం బుద్ధ వనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, స్థానిక శాసనసభ్యులు  కుందూరు జయ వీర్ రెడ్డి, ఎం ఎల్ సి శంకర్ నాయక్, బాలీవుడ్ నటుడు గగనమాలిక్ లతో కలిసి జలాశయం మధ్యన ఉన్న చాకలి గట్టును పరిశీలిస్తూ నాగార్జునకొండను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, ఆర్ట్ మరియు ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, ఇంజనీర్లు శ్రీనివాస్ రెడ్డి నజీష్,దైవజ్ఞ శర్మ, సాగర్ సిఐ శ్రీను నాయక్, ఎస్‌ఐ ముత్తయ్య, ఎస్ పి ఎఫ్ ఎస్ ఐ రఘు, ఇంటలిజెన్స్ ఏఎస్‌ఐ వెంకటరెడ్డి, వెటర్నరీ డాక్టర్ కేశవ్ అజ్మీర, యోగ మాస్టర్ సైదయ్య, మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు, స్థానిక బీసీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు మరియు బౌద్ధవానులు పాల్గొన్నారు.