11-07-2025 01:58:58 PM
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) అన్నారు. గాంధీ భవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయం ఉందని తెలిపారు.
రాహుల్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చిన అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రివర్గ సభ్యుల కృషి అభినందనీయం అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(BRS MLC Kalvakuntla Kavitha) ఏం సంబంధం..? కవిత లేదు భవిత లేదు.. మేం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. కవిత ను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చోటా మోటా ధర్నాలు చేసి నావల్లే అయింది అనడం ఏంటి? అన్నారు. కేసీఆర్ పదేళ్లు ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతుందని ఆయన మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ ఎజెండా, రేవంత్ కమిట్‌మెంట్ అని మహేష్ గౌడ్ తెలిపారు.