ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
లబ్ధిదారులకు నూతన వస్త్రాల పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కొనరావుపేట, జూన్ 3 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం మర్తన్నపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా గృహప్రవేశం చేసిన కుటుంబాలకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు, అధికారులు, లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.






