7 March, 2026 | 6:00 AM

గ్రేటర్‌ను క్లీన్ సిటీగా మార్చాలి

04-01-2026 12:13 AM
  1. పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం తేవాలి
  2. స్పెషల్ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయాలి
  3. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 3 ( విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై మరింత దృష్టి సారించాలని, నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం తీరుతెన్నులపై శనివారం ఆయన అదనపు కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం స్పెషల్ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కేవ లం చెత్తను తొలగించడమే కాకుండా, పరిశుభ్రత ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసు కురావాలని సూచించారు. ప్రజా భాగస్వా మ్యం ఉంటేనే గ్రేటర్ హైదరాబాద్ను ఆదర్శవంతమైన పరిశుభ్ర నగరంగా మార్చగ లమని నగర కమిషనర్ స్పష్టం చేశారు.

పారిశుద్ధ్య పనులను తాను, జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా నగరంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలను ఇస్తోంది. గత ఆరు రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 300 వార్డుల్లోని 1,204 పాయింట్ల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు..ఇప్పటివరకు అదనంగా 1,458 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించారు.547 మెట్రిక్ టన్నుల సీఅండ్‌డీ వేస్ట్‌ను  తొలగించారు.