07-08-2024 01:44:22 AM
2 జిల్లాల్లోనే 60 శాతం కాలేజీలు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోనే అత్యధికం
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో కేవలం మూడు జిల్లాల్లోనే అత్యధిక ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ (19), ప్రైవేట్ (156) కలిపి మొత్తం 175 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 60 శాతం కళాశాలలు మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 45 కాలేజీలుండగా, రంగారెడ్డిలో 44 కాలేజీలు, హైదరాబాద్‌లో 20 కాలేజీలున్నాయి. మిగిలిన 40 శాతం కాలేజీలు ఇతర 30 జిల్లాల్లో ఉన్నాయి. కనీసం ఒక కాలేజీ కూడా లేని జిల్లాలు దాదాపు పది వరకు ఉన్నాయి.
అత్యధిక కాలేజీలు గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఉండడంతో ఈ మూడు జిల్లాల్లోనే ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు రూరల్ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. 2020 విద్యా సంవత్సరంలో అత్యధికంగా 83.02 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరగా, పైవేట్ కాలేజీల్లో 65.85 శాతం మంది చేరారు. 2021 సర్కారు కాలేజీల్లో 77 శాతం మంది చేరగా, ప్రైవేట్‌లో 70.54 శాతం మంది అడ్మిషన్లు పొందారు.
కానీ ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో ప్రైవేట్‌లో చేరిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసిన గతేడాది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,12,069 సీట్లు ఉన్నాయి.