07-08-2024 01:32:15 AM
ఉద్యోగ కల్పనలోనూ వెనుకబాటు: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తంచేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో క్షీణతపై గణాంకాలను మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
2022 సంవత్సరంలో తెలంగాణ నుంచి 57,706 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే, 2023 26,948 కోట్ల ఎగుమతులే జరిగియని, ఐటీ ఉద్యోగాలు కల్పించడంలో కూడా భారీగా పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. 2022 1,27,594 ఉద్యోగాలు వస్తే, 2023 కేవలం 40,285 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఐటీ ప్రగతి గణనీయంగా పెరిగేందుకు ఎన్నో చర్యలు తీసుకుందని, సింగిల్ విండో విధానం, టీఎస్ ఐపాస్, ఐటీ రంగానికి సంబంధించి ప్రభుత్వ పాలసీల కారణంగా హైదరాబాద్‌లో ఐటీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. హైదరాబాద్‌ను దేశానికే ఐటీ కేంద్రంగా చేసేందుకు తాము ఎంతో కృషి చేశామని వెల్లడించారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ఐటీ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఐటీ రంగం పురోగతి ఎంతో మేలు చేసిందని, ఉపాధి కల్పన పరంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఐటీతోపాటు ఐటీఈఎస్ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.
మళ్లీ నగరంలో ఐటీ రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున రావాలంటే ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను పెంచుతూ శాంతిభద్రత పట్ల కఠినంగా ఉండాలని సూచించారు.