14న కొడంగల్‌లో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవం
- సీఎంను ఆహ్వానించిన అక్షయపాత్ర ఫౌండేషన్
- ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.7, అక్షయపాత్ర రూ.25ఖర్చు
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అయతే మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది. ఈనెల 14న దీని ప్రారంభోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు.
ఈ గ్రీన్ ఫీల్డ్ కిచెన్‌లో వండిన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. నాణ్యమైన భోజనం తయారు చేసి అందించేందుకు అక్షయ ఫౌండేషన్ దాదాపు రూ.25 వరకు ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును అక్షయ పాత్ర ఫౌండేషన్ భరిస్తుంది.
గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ పాస్ట్ అందించే పథకం విజయవంతంగా అమలవుతుంది. 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారం అందిస్తున్నారు. అన్ని గ్రామాల్లోని పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఈ పథకానికి మంచి స్పందన వచ్చిందని, ఈ పథకం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.






