1 August, 2026 | 2:40 AM

రామగుండం రైల్వేలైన్‌కు పచ్చజెండా

28-05-2024 01:26 AM

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): మూడు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోన్న రైలు మార్గానికి ఎట్టకేలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామగుండం మణుగూరు రైల్వే లైన్ ఏర్పాటుకు మార్గం సుగమ మవ్వడంతో సరుకు రవాణాతో పాటు రాకపోకలకు సుమారు 100 కి.మీ దూరం తగ్గనుంది. సింగరేణి విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ నిర్మించనున్న ఈ మార్గం ద్వారా బొగ్గు రవాణాకు ఎంతో వెసులుబాటు కలుగనుంది. కోల్ కారిడార్ ఏర్పాటు కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఏర్పాటులో భాగంగా 207.80 కి.మీ మేర నిర్మించనున్న ఈ రైల్వే లైన్ భూసేకరణ చేపట్టేందుకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. భూసేకరణ పూర్తవ్వగానే పనులు చేపట్టనున్నారు.

రెండు దశాబ్దాల కిందటే సర్వే...

బొగ్గు, విద్యుదుత్పత్తి కేంద్రాలుగా ఉన్న మణుగూరు, రామగుండం మధ్య కొత్తగా రైల్వే లైన్ వేయాలని లాలూప్రసాద్‌యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా 1999లో సర్వే నిర్వహించారు. అనంతరం ఈ రైల్వే లైన్ నిర్మాణంపై ముందుకు వెన క్కూ అన్నట్లుగా పరిస్థితి సాగింది. ఇన్ని రోజులుగా సర్వేలకే పరిమితమైంది తప్పించి ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఎట్టకేలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడు దశాబ్దాల కల సాకారమవ్వనుంది. 

ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్‌తో...

రైల్వేశాఖ సరుకు రవాణాకు అధిక ప్రాధాన్యమిస్తోంది. త్వరగా సరుకు రవాణా కోసం ప్రత్యేక ట్రాక్‌లను నిర్మిస్తోంది. ట్రిపుల్ ఆర్ (రైల్, రివర్, రోడ్డు) కాన్సెప్ట్‌తో సరుకు రవాణాకు ఉన్న అవకాశాలను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. ఇటు రామగుండం, అటు మణుగూరు రెండు పట్టణాలు కూడా గోదావరి తీరంలోనే ఉన్నాయి. ఈ రెండు పట్టణా ల మధ్య రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు రైల్వే మార్గం నిర్మిస్తే మూడు విధాలా సరుకు రవాణాకు అవకాశం కలగనుంది. 

రూ. 2,911 కోట్ల అంచనా...

రామగుండం మణుగూరు ప్రాజెక్టు ప్రాథమిక పనులకు కేంద్రం 2013 రైల్వే బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను భరించేందుకు ముందుకురాకపోవడంతో అప్పట్లో రైల్వే లైన్ పనులకు అవకాశమే లేకుండాపోయింది. అయితే కోల్ ఏరియా కావడంతో ఈ కొత్త లైన్ నిర్మిస్తే ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రమే సొంతంగా ఈ లైన్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. పదేళ్ల కిందట ఈ లైన్ అంచనా వ్యయం రూ.1,112కోట్లు కాగా... ఇప్పుడది రూ.2,911కు పెరిగిందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 

ఆధ్యాత్మిక మార్గంగానూ...

ఈ మార్గంలో మంథని, కాళేశ్వరం, రామ ప్ప, మేడారం, కోటగుళ్లు తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు లక్నవరం చెరువు, బొగత జలపాతాలను చేరుకునేందుకు రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఫలి తంగా అటు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఈ ప్రాంతానికి రద్దీ పెరిగి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలోని 6 జిల్లా ల్లో ఉన్న 26 భూగర్భ, 20 ఉపరితల గనుల ద్వారా ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. సింగరేణి ఏటా బొగ్గు రవాణాకే వందల కోట్లను ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం కొత్త లైన్ ద్వారా దూరం తగ్గి ఖర్చు భారీగా తగ్గనుంది. బొగ్గు రవాణా వ్యయం తగ్గేందుకు అవకాశం ఉండటం వల్లే రైల్వే శాఖ ఈ మార్గం ఏర్పాటుకు ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు.