calender_icon.png 13 September, 2024 | 1:17 AM

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్

04-07-2024 01:23:43 AM

5 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ 

మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్థికశాఖ

రెండేళ్లు సర్వీస్ పూర్తయితేనే స్థానచలనం

ప్రతి ఉద్యోగికి 5 ఆప్షన్లు 

కొన్ని వర్గాలకు మినహాయింపు 

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్నీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల ప్రక్రియపై కీలక మార్గదర్శకాలను ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విడుదల చేశారు. జూలై 5వ తేదీ నుంచి జూలై 20వరకు ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ జరగనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ట్రాన్‌ఫర్లను కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా చేపట్ట నున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ బదిలీల్లో ఎవరికి మినహాయింపు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వొద్దు అనే అంశాలను ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొంది. 

నాలుగేళ్లు పూర్తయిన వారికి తప్పనిసరి

  1. * 2024 జూన్ 30 నాటికి ఒకే ఆఫీస్‌లో 4 సంవత్సరాలకు మించి పని చేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్నది. 
  2. * 2025 జూన్ 30 లోపు పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు నాలుగేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసినప్పటికీ వారిని బదిలీ చేయొద్దని, ఒకవేళ వారు కోరుకుంటే చేయొచ్చని వెల్లడించింది.
  3. * 2024 జూన్ 30 నాటికి ఒకే ఆఫీస్‌లో రెండేళ్ల సర్వీస్ పూర్తికాని వారికి ఎలాంటి బదిలీలు ఉండవని చెప్పింది.  
  4. * ఇదే సమయంలో నిర్దిష్ట గడవు పూర్తయి.. జీవిత భాగస్వామి కారణాలను చూపి బదిలీ చేయొద్దని అభ్యర్థిస్తే.. అలాంటి అభ్యర్థనలను పట్టించుకోవద్దని సూచించింది. 
  5. * ఏ కేడర్‌లోనైనా 40శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదని వెల్లడించింది. 

బదిలీ మినహాయింపులు

ఈ బదిలీ ప్రక్రియలో ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అవి..

  1. * భార్యాభర్తలు ఒకే దగ్గర నాలుగేళ్లకు మించి పనిచేస్తూ.. బదిలీ చేయాల్సి వస్తే.. అందులో ఒక జీవిత భాగస్వామిని మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. 
  2. * వితంతువులు, 70శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన ఉద్యోగులకు వారి ఇష్టానుసారం బదిలీలు ఉంటాయి.
  3. * మెంటల్లీ రిజార్డడ్ పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులను వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి మాత్రమే బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  
  4. * మెడికల్ గ్రౌండ్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు కానీ, వారి కుటుంబ సభ్యులు గానీ క్యాన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, టీబీ వ్యాధులతో బాధపడేవారు  ఉంటే.. వారిని వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశాలకు బదిలీ చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. 

బదిలీల ప్రక్రియ ఇలా.. 

  1. జూలై 5- 8వ తేదీ వరకు పోస్టుల ఖాళీల వివరాలు, బదిలీ చేసే ఉద్యోగులు జాబితా విడుదల
  2. జూలై 9 నుంచి 12వ తేదీ వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
  3. జూలై 13 నుంచి 18 వరకు దరఖాస్తులను వెరిఫికేషన్ చేయడం. కౌన్సిలింగ్ నిర్వహించడం.
  4. జూలై 19, 20 తేదీల్లో ఉద్యోగులకు బదిలీల ఉత్తర్వులు జారీ.
  5. ఉద్యోగులకు అందించే దరఖాస్తు పత్రంలో వారికి ఐదు ఆప్షన్లను ఇస్తారు. ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లను బట్టి బదిలీ ఉంటుంది. 
  6. కష్టతరమైన ప్రాంతాన్ని ఎవరూ ఎంచుకోకపోతే.. దాన్ని లాటరీ ద్వారా భర్తీ చేస్తారు. 
  7. బదిలీలను పారదర్శక పద్ధతిలో నిర్వహించేందుకు వీలైన చోట, ఆన్‌లైన్/వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం నిర్వహించనుంది. 

ఇదిలా ఉంటే, కొన్ని విభాగాల్లో బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. లెక్చరర్లు, వాణిజ్య పన్నులు శాఖ, ప్రొహిబిషన్, ఎక్సుజ్ డిపార్ట్‌మెంట్, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖల్లో బదిలీలు ప్రత్యేక మార్గదర్శకాల ద్వారా జరుగుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.