16-11-2025 12:07:37 PM
పాట్నా: బీహార్ లో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ (బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ) 243 సీట్లలో 200కి పైగా స్థానాలు సాధించి చరిత్రాత్మక విజయం సాధించింది. ఈనెల 19, 20వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగనుంది. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువులు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా ముగియడంతో ఆదివారం 18వ శాసనసభకు నోటిఫికేషన్ జారీ కానుంది. బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. 18వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఇవాళ బీహార్ గవర్నర్‌కు అధికారికంగా తెలియజేస్తుంది. ఈ నోటిఫికేషన్‌తో, అసెంబ్లీ ఎన్నికలకు అమలులో ఉన్న మోడల్ ప్రవర్తనా నియమావళి ముగుస్తుంది. సోమవారం నితీష్ కుమార్ మంత్రివర్గ సమావేశం నిర్వహించి, 17వ శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం ఆమోదిస్తారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్‌తో సమావేశమై తన రాజీనామాను సమర్పించనున్నారు. ఈ రాజీనామా కొత్త ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తుంది. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత, ఎన్డీఏలోని అన్ని భాగస్వామ్య పార్టీల శాసనసభా పక్ష నేతలు సమావేశమై కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు. ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకున్న తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్‌కు దరఖాస్తును అందజేస్తారు. ఇదిలా ఉంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ 15, జేడీయూకి 14, ఎల్జేపీకి 3 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నిర్ణయాత్మక విజయం సాధించడంతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ గణనీయమైన ఎదురుదెబ్బను చవిచూసింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ కూటమి సిద్ధమవుతున్న తరుణంలో పాట్నా, ఢిల్లీలో ఈ భారీ విజయం ఉన్నత స్థాయి రాజకీయ చర్చలకు దారితీసింది. నితీష్ కుమార్ పదవసారి రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారని భావిస్తున్నారు, బీజేపీ, జెడీ(యు) అగ్ర నాయకులు మంత్రివర్గ కూర్పు, కీలక శాఖల పంపిణీ, ప్రమాణ స్వీకార షెడ్యూల్‌ను ఖరారు చేయడానికి వరుస రహస్య సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాజకీయ వర్గాలు తెలియజేశాయి.