20 June, 2026 | 2:41 AM

రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్‌కు గ్రీన్ సిగ్నల్

20-06-2026 12:00 AM
  1. చౌదరిగూడలో స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
  2. అప్రోచ్ రోడ్డు సమస్యకు అక్కడికక్కడే పరిష్కారం
  3. రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే భరోసా

శంషాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యా రంగాన్ని ఆధునికీకరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్టులో భాగంగా శంషాబాద్ మండలంలోని చౌదరిగూడ గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పాఠశాల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గురువారం అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. స్కూల్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రహదారి అనుసంధానం, విద్యార్థుల రాకపోకల సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.స్కూల్కు వెళ్లే అప్రోచ్ రోడ్డు విషయంలో నెలకొన్న సమస్యను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపారు. రోడ్డు నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడి వారి అభ్యంతరాలు తెలుసుకున్నారు. నష్టపోయే రైతులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమి కేటాయించే అంశాన్ని పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే భరోసాతో రైతులు సానుకూలంగా స్పందించడంతో రోడ్డు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మార్గం సుగమమైందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.