14 August, 2026 | 8:02 PM

ఫిల్టర్ బెడ్‌ ను తనిఖీ చేసిన నగర మేయర్

14-08-2026 06:55 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై ఇటీవల వెలువడిన వార్తలు, ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో నగర మేయర్  కొలగాని శ్రీనివాస్  మున్సిపల్ అధికారులతో కలిసి నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్‌లో జరుగుతున్న నీటి శుద్ధీకరణ ప్రక్రియ, ఫిల్టరేషన్ వ్యవస్థ, క్లోరినేషన్, నిల్వ ట్యాంకులు, శుద్ధి చేసిన నీటి నాణ్యతతో పాటు నగరానికి నీటి సరఫరా జరుగుతున్న విధానాన్ని మేయర్ స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన తాగునీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఫిల్టర్ బెడ్ నుంచి బయటకు వెళ్లే ప్రతి లీటర్ నీరు పూర్తిగా శుద్ధి చేయబడి, నిర్ణీత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తాగునీటి నమూనాలను సేకరించి  నాణ్యత పరీక్షలు చేయాలని సూచించారు.

వర్షాకాలంలో నీటి కలుషితానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మేయర్ సూచించారు.ఈ తనిఖీలో మేయర్ వెంట కార్పొరేటర్లు మాసం గణేష్, ఏపీపీ చంద్ర, గాజా రమ శివరాం, భారీ అపర్ణ జితేందర్, ఎస్‌ఈ సంపత్ రావు, డీఈ దేవేందర్ రెడ్డి, ఏఈ రఘువర్ధన్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.