8 August, 2026 | 12:59 PM

కమ్యూనిటీ షెడ్‌కు భూమిపూజ

08-08-2026 12:19 PM

వాంకిడి, (విజయక్రాంతి): గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాంకిడి మండలంలోని జంబుల్ ధరి గ్రామంలో కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి సర్పంచ్ కుమ్రం పవన్, ఉప సర్పంచ్ విఠల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారి ఆధ్వర్యంలో శనివారం షెడ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో ప్రత్యేకంగా స్థలం అందుబాటులో లేకపోవడంతో శిథిలావస్థకు చేరిన పాత టిడబ్ల్యూపీఎస్ పాఠశాల భవనాన్ని తొలగించి, అదే స్థలంలో కమ్యూనిటీ షెడ్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.

గ్రామానికి మధ్యలో షెడ్ నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలందరికీ అందుబాటులో ఉండటంతో పాటు సంప్రదాయ, సామాజిక కార్యక్రమాలు, గ్రామస్థాయి సమావేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ కుమ్రం పవన్, ఉప సర్పంచ్ విటల్ తెలిపారు.గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్ సమన్వయంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పటేల్ పండు, బాలకిషన్, మధుకర్, వాసుదేవ్, తదితరులు పాల్గొన్నారు.