8 August, 2026 | 12:59 PM

పట్టుకున్నారు.. వదిలేశారు..!

08-08-2026 12:23 PM

సోమశిల టూరిజం సిబ్బందిపై దాడి ఘటనలో పోలీసుల తీరు. 

బోటింగ్ పాయింట్ వద్ద పనిచేయని సీసీ కెమెరాలు. 

ఘటనాస్థలాన్ని పరిశీలించిన టూరిజం కార్పొరేషన్ ఉన్నతాధికారులు

కొల్లాపూర్ రూరల్: సోమశిల టూరిజం కేంద్రంలో టూరిజం శాఖ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం వదిలిపెట్టినట్లు వస్తున్న వార్తలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు. శుక్రవారం ఘటన స్థలాన్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ జనరల్ మేనేజర్ రవీందర్, విజిలెన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సమ్మయ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా రాత్రివేళ అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన బోటింగ్ పాయింట్ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గమనించి ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ పెంచాలన్నారు. దాడిలో గాయపడిన టూరిజం శాఖ ఉద్యోగులు దేవరాజు, శివలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను తెలంగాణ టూరిజం కార్పొరేషన్ భరిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులు ప్రయాణించిన కారు నంబర్ ఆధారంగా వారిని గుర్తించినప్పటికీ, ఐదుగురు అనుమానితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తిరిగి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలాన్ని సందర్శించిన టూరిజం శాఖ ఉన్నతాధికారులు కూడా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో టూరిస్ట్ పోలీసులు, బోటింగ్ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.