8 August, 2026 | 1:41 PM

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

08-08-2026 12:33 PM

హైదరాబాద్: నగరంలో దోమల(Mosquito Control) ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం(GHMC Entomology Department) ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు చేపట్టనున్న స్పెషల్ మాన్సూన్ డ్రైవ్‌లో(Special Monsoon Drive) భాగంగా దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మినిస్టర్ క్వార్టర్స్‌లో IEC కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దోమల నివారణకు ఎంటమాలజీ విభాగం ఉపయోగిస్తున్న వివిధ పరికరాలను పరిశీలించి, వాటి పనితీరును మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

దోమల నివారణకు విస్తృత చర్యలు

నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం('Friday-Dry Day' program) నిర్వహిస్తున్నామని సూచించారు. ఇంటింటికీ వెళ్లి నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. దోమల లార్వాలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా ఫాగింగ్ చేపడుతున్నామని తెలిపారు. దోమల నివారణపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పిన మంత్రి పొన్నం వర్షాల కారణంగా నిల్వ ఉన్న నీటిని తొలగించేలా ప్రజలకు సూచనలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలు స్వీయ బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. హైదరాబాద్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జీహెచ్‌ఎంసీ ద్వారా ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణపై అవగాహన కల్పిస్తోందన్నారు. ప్రజలందరూ స్వీయ బాధ్యతతో తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమంలో భాగంగా ఇళ్లలో, పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల లార్వాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు.

ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్‌ను ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దగలమని సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వివరించారు. జీహెచ్‌ఎంసీ చేస్తున్న విజ్ఞప్తిని ప్రతి ఒక్కరూ పాటించి దోమల నివారణలో భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.