8 August, 2026 | 12:50 PM

వంద స్తంభాల గుడిని పరిరక్షించాలి: చత్రపతి యువజన సంఘం డిమాండ్

08-08-2026 12:17 PM

బోధన్, ఆగస్టు 08 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని మా లక్ష్మి కళ్యాణ మండపంలో చత్రపతి యువజన సంఘం అధ్యక్షుడు అడ్డలోడి శ్రీనివాస్ మాట్లాడుతూ....బోధన్‌ పట్టణంలో  100 స్తంభాల గుడి  చారిత్రక ప్రాశస్త్యం కలిగిన బోధన్‌లోని వంద స్తంభాల గుడిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిరక్షించి, అభివృద్ధి చేయాలని చత్రపతి యువజన సంఘం డిమాండ్ చేసింది. ఆలయం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుకుంటున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

బోధన్‌కు ప్రాచీన చరిత్ర ఉందని, వంద స్తంభాల గుడికి కూడా విశిష్టమైన చారిత్రక ప్రాధాన్యత ఉందని తెలిపారు. రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, గోల్కొండ కోట వంటి చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పరిరక్షిస్తున్న తరహాలోనే బోధన్ వంద స్తంభాల గుడిని కూడా పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ విషయంపై గత నెల 21న ప్రభుత్వానికి న్యాయ నోటీసులు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మ్యూజియం శాఖ, ఎండోమెంట్స్ శాఖ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితరులకు నోటీసులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆలయంలో పూజలకు అనుమతి కల్పించడంతో పాటు, ఆలయ చరిత్రపై ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి పరిశోధన చేయాలని కోరారు. ప్రభుత్వం 50 రోజుల్లో సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని, స్పందన లేకపోతే న్యాయపరంగా కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు. వంద స్తంభాల గుడి పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, చరిత్రకారులు, మేధావులు, విద్యార్థులు, యువత కలిసి ఉద్యమించాలని చత్రపతి యువజన సంఘం పిలుపునిచ్చింది. ఈ అంశంపై ఎలాంటి రాజకీయ విభేదాలకు తావులేకుండా శాంతియుతంగా, న్యాయబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.