09-07-2025 12:00:00 AM
మేకల ఎల్లయ్య :
ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతుంటే, పేదలు మరింత పేదలుగా మారుతున్నారనేది నిజం. ఈ ధోరణి మున్ముందు సామాజిక అస్థిరతకు దారితీయవచ్చు. ఈ పరిస్థితిని అరికట్టడానికి సమగ్రమైన, సుదూర దృష్టితో కూడిన విధానాలు అవసరం. కేవలం ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించకుండా, సమ్మిళిత వృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. అంతటి వేగవంతమైన వృద్ధి వెనుక ఆందోళన కలిగించే కొన్ని ఆర్థిక అసమానతలూ దాగి ఉన్నా యి. తాజాగా సాక్షాత్తు కేంద్ర మంత్రి నితి న్ గడ్కరీ దేశంలో పేదల సంఖ్య పెరుగుతున్నదని వ్యాఖ్యానించడం దేశంలో కొత్త చర్చకు దారి తీసింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు యేటికేడు పెరుగుతున్నప్పటికీ, ఆ వృద్ధి ఫలాలు మాత్రం అట్టడుగున్న వర్గాలకు అందడం లేదనేది వాస్తవం.
నిత్యా వసరాల ధరలు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, పనిచేస్తున్న వారి వేత నాలు చాలా తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. పేదరికం కేవలం ద్రవ్య లోటునే కాదు.. విద్య, ఆరోగ్యం, పోషణ, నాణ్యత జీవనంలో వెనుకబాటునూ సూచిస్తుంది. ప్రసిద్ధ ఆర్థికశాస్త్ర నిపుణుడు, విశ్లేషకుడు హార్దిక్ జోషి ఇటీవల లింక్డ్‌ఇన్‌లో దేశ ఆర్థిక స్థితిగతులకు సంబంధిం చిన గణాంకాలను పంచుకున్నారు.
వాటి ప్రకారం.. దేశం మొత్తంలోని సంపదలో 40.1 శాతం.. కేవలం 1 శాతం మంది ఉం ది. దేశ జనాభాలో 50 శాతం మంది ప్రజ ల వద్ద కేవలం 6.4 శాతం మాత్రమే సం పద ఉంది. అంటే, దేశ జనాభాలో సగం మంది అంతంతమాత్రం సంపాదనతో నెట్టుకువస్తున్నారని దీనర్థం.
జాతీయ ఆదాయం విషయానికి వస్తే, పైన ఉన్న 10 శాతం మంది ప్రజలు 57.7 శాతం జాతీ య ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ నంబర్ ఆదాయ పంపిణీలోనూ తీవ్రమైన అంతరాన్ని ఎత్తి చూపుతున్నది. దేశంలో ఉత్పత్తి అవుతున్న సంపదలో ఎక్కువ భాగం కొద్దిమంది చేతుల్లోకి వెళ్తుందనేది సుస్పష్టం.
ఆర్థిక సంస్కరణల ప్రభావం?
భారత్ ప్రస్తుత ఆర్థిక అసమానతలకు కారణం 1991లో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. భారతదేశంలోకి ప్రపంచ మార్కెట్ వ్యవస్థలను తీసుకొచ్చిందని, సరళీకరణ, ప్రైవే టీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) విధానా ల అమలు కారణంగా.. వ్యవసాయ రం గం, అసంఘటిత రంగంపై ఆధారపడిన కార్మికులు పెద్దగా లాభపడలేదని వారి వాదన.
సంపద సృష్టి జరిగిందన్న సంగతి వాస్తవమే అయినప్పటికీ, సంపద పంపిణీలో మాత్రం అసమానతలు ఉన్నాయ ని.. అప్పటి నుంచి ధనిక, పేదల మధ్య అంతరం పెరుగుతూ వస్తున్నదని, ఇది ఇప్పుడు అసలు ఊహించలేనంత ఉందని వారంటారు. దేశంలోని రాజకీయ పార్టీల వద్ద కూడా లెక్కలేనంత డబ్బు ఉన్నది. విరాళాలు, చందాల రూపాల్లో వేల కోట్ల సొమ్ము పేరుకున్నది. వీటిలో లెక్కచెప్పిన సొమ్ము కంటే, లెక్కచెప్పని సొమ్మే ఎంతో ఎక్కువ.
ఆ లెక్క చెప్పని సొమ్మంతా నల్లధనమేనని వేరే చెప్పనక్కర్లేదు. ఇక స్విస్ బ్యాంక్ ఖాతాల గొడవ ఇప్పటిది కాదు. కార్పొరేట్‌శక్తులు, బడా రాజకీయ నాయకులంతా నల్లధనాన్ని అక్కడే దాచుకుంటు న్నారని, అలా దాచుకోవడం దేశ ఆర్థిక వృద్ధిని అణచివేయడమేనని దశాబ్దాల నుంచి సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థల ఆస్తులు..
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫా ర్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ). 2008 24 వరకు బీజేపీకి విరాళాల రూపంలో అందిన సొమ్ము అక్షరాలా రూ.8,251.75 కోట్లు. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కి విరాళాల రూపంలో అందిన సొమ్ము రూ.1,019 కోట్లు. అలాగే తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆ ర్‌ఎస్)కు అందిన సొమ్ము తక్కువేం కాదు.
ఆపార్టీకి విరాళాల ద్వారా అందిన సొమ్ము రూ.529.09 కోట్లు. తమిళనాడుకు చెంది న డీఎంకే వద్ద ఉన్న సొమ్ము రూ.676.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్ సీపీ వద్ద ఉన్న సొమ్ము రూ. 503.94 కోట్లు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వద్ద ఉన్న సొమ్ము రూ.320.68 కోట్లు. భారతదేశంలో కార్పొరేట్ కంపెనీల ఆస్తులు, వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ), నికర విలువ కూడా చాలా ఎక్కు వ.
రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, అదానీ గ్రూప్, హెడీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కార్పొరేట్ సంస్థలు కోటానుకోట్ల ఆస్తులు కలిగి ఉన్నాయి. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్, భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీలలో ఒకటి. 2023 చివరి నాటికి, రిలయన్స్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.20లక్షల కోట్లకు పైగా నమోదైంది. దేశంలో అతిపెద్ద వ్యాపార సమూహాల్లో ఒకటైన టాటా గ్రూప్, గౌత మ్ అదానీ గ్రూప్ సైతం భారీగా ఆస్తులను కలిగి ఉన్నాయి.
మరి పేదల పరిస్థితులేంటి?
ఒకవైపు కార్పొరేట్ దిగ్గజాలు, రాజకీ య పార్టీలు కోట్లాది ఆస్తులు సంపాదిస్తుంటే, పేదల పరిస్థితి మాత్రం దయనీ యాంగా కనిపిస్తున్నది. దేశంలో నిరుపేదలు ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు, ప్రతి అడుగులోనూ వారు ఆర్థిక భారాన్ని మోస్తూ ఉంటారు. కూలికి వెళ్తే గానీ కడుపు నిండని దైనందిన జీవితం వారిది. పెరిగే నిత్యావసర ధరలు వారి వెన్ను విరుస్తున్నాయి.
కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. లేదంటే బయ ట అప్పులు చేసి జీవితాంతం వాటిని తీర్చుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. పట్టణా ల్లో మురికివాడల్లో చిన్న గదుల్లో బతుకు వెళ్లదీయడం, గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేని ఇళ్లల్లో కాలం గడపడం, పౌష్టికాహార లోపంతో అనారోగ్యాలకు గురవడం..
ఇదంతా పేదల దైనందిన జీవిత చిత్రం. ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా రూ.లక్షల కోట్లు పార్టీలకు చేరినప్పుడు, లేదా ఒక కార్పొరేట్ కంపెనీ కొన్ని వారాల్లో వేల కోట్లు సంపాదించినప్పుడు, ఆ సంపదలో తమ కు దక్కాల్సిన కనీస వాటా ఎక్కడ? అని వారి మనసు లోతుల్లో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది.
ఆకాశహర్మ్యాలు అభి వృద్ధికి చిహ్నాలుగా నిలిచినా, వాటి నీడన వేలాది మంది పేదల ఆకలి కేకలు, నిస్సహాయతలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ అసమానతలు కేవలం ఆర్థిక అంతరాలు మాత్రమే కాదు, సామాజిక న్యాయానికి సవాళ్లు,మానవ గౌరవానికి అవమానాలు.
అంతరాలు పూడ్చాలి..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు, ఆర్థిక నిపుణుడు, విశ్లేషకుడు హార్దిక్ జోషి వెల్లడించిన గణాంకాలు ప్రస్తుతం దేశంలో ‘అలార్మింగ్ పరిస్థితి’ని సూచిస్తున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతుంటే, పేదలు మరింత పేదలుగా మారుతున్నారనేది నిజం. ఈ ధోరణి మున్ముందు సామాజిక అస్థిరతకు దారితీయవచ్చు. ఈ పరిస్థితిని అరికట్టడానికి సమగ్రమైన, సుదూర దృష్టితో కూడిన విధానాలు అవసరం.
కేవ లం ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించకుండా, సమ్మిళిత వృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అందుకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు, వ్యవసాయ రంగానికి మద్దతు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, పన్ను విధానాల్లో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆర్థిక అసమానతలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి, దేశ పురోగతికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.
దేశ భవిష్యత్తు కోసం, ఈ గణాంకాలను కేవలం సంఖ్యలుగా చూడకుండా, వాటి వెనుక ఉన్న మానవ జీవితాలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. దేశంలో ఆర్థిక అసమానతలను తగ్గించ డం ప్రస్తుతం ప్రభుత్వాల ముందున్న సం క్లిష్టమైన సవాలు. కేవలం కొన్ని పథకాలు లేదా సంస్కరణలతో ఆర్థిక అసమానతలను పరిష్కరించడం కష్టం. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, పేదరికం విస్తరించడం అనే ప్రస్తుత పరిస్థితిని మార్చడానికి ఇప్పుడు ఉన్న పాలకవర్గాలు సిద్ధం కావాలి.
వ్యాసకర్త సెల్ : 9912178129