calender_icon.png 12 July, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికే మన్నికకు ప్రతీక

09-07-2025 12:00:00 AM

పాలకుర్తి రామమూర్తి :

అనిశ్చిత పరిస్థితులు ఎదురైన సమయంలో ఒక నిర్ణయానికి ప్రత్యామ్నాయంగా మరొకటి ఉన్నప్పుడు అనుకూలతను ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుంది. నిర్ణయ ఫలితం ఏదైనా వెనుకకు తిరిగి చూసుకోవడం.. పశ్చాత్తాపడడం అవివేకం.

జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలోనైనా.. ఉద్యోగం చేసే సంస్థను ఎన్నుకోవడంలోనైనా, ఉద్యోగమా.. వ్యాపారమా అని నిర్ణయించుకోవడంలోనైనా.. ఉన్నత చదువులకు వెళ్లాలా, ఉపాధి వెతుక్కోవాలా అనే ఆలోచనలోనైనా కావ చ్చు.. ఇలా సందర్భమేదైనా ప్రతి వ్యక్తికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సందిగ్ధత కలగక మానదు. నిజానికి సందిగ్ధత హేయత్వంగా చెప్పబడుతుంది. ఎవరైతే సంది గ్ధతను అధిగమించి లక్ష్య సాధన మార్గం లో ముందుకు సాగుతారో వారినే విజ యం వరిస్తుంది.

పథి ద్వుదీభావే స్వభూమిగతో యాయాత్, అభూమిష్ఠానాం;

హి స్వభూమిష్ఠాః యుద్ధే ప్రతిలోమా భవంతి!

(కౌటిలీయం 10-2)

రెండు మార్గాల్లో వెళ్లడానికి అవకాశం ఉన్నప్పుడు తనకు అనుకూలమైన మార్గాన ప్రయాణం చేయాలి. తనతో ఉన్నవారు ఎదుటి భూమిలో లేదా అనుకూలంగా లేని ప్రదేశంలో ఉన్నవారికి ప్రతికూలురు అవుతారని ఆచార్య చాణక్య చెబుతాడు. వ్యక్తి బలాబలాలను, వర్తమాన పరిస్థితులను అనుసరించి వ్యూహాత్మకమైన, నిర్ణ యాన్ని తీసుకొని సమయోచిత మార్గాన్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను గురించి ఇక్కడ చాణక్యుడు ప్రస్తావించాడు.

సంస్థ లో వస్తు పంపిణీ, రవాణా నిర్వహణలో.. దగ్గరగా ఉండే అనువైన మార్గాన్ని ఎన్నుకోవడం వల్ల వ్యయనియంత్రణ సాధ్యపడుతుంది. ఉత్పత్తులు త్వరగా వినియోగదారునికి అందించగలుగుతారు. సరఫరా సమయమూ కలసివస్తుంది. కొత్త వ్యాపా ర అవకాశాలను వెతుక్కునే క్రమంలో పోటీవ్యవస్థను అధిగమించేందుకు సన్నద్ధత అవసరం.

అంతేకాదు తన ఉత్పత్తులు ఎవరికి చేరాలో ఆ సమూహాన్ని ఎన్నుకోవడంలో స్పష్టత అవసరం. వనరుల సమీ కరణ, వాటి వినియోగం పట్ల అప్రమత్తం గా ఉండడం వల్ల లక్ష్యాన్ని చేరడం సులువవుతుంది.

సందిగ్ధతను అధిగమించేందుకు ఒకటి కన్నా ఎక్కువ పరిష్కార మార్గాలు కనిపించిన సమయంలో.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే.. అది జీవన్మరణ సమస్యగా మారొ చ్చు. ఆ సందర్భంలో విషయాన్ని లోతుగా ఆలోచించడం, విశ్లేషించడం, లాభనష్టాల ను సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోవడం అవసరం.

ఇందులో ప్రముఖంగా.. సంభావ్యతలు లేదా అవకాశాలను పరిశీలించడం; వాటికి ప్రత్యామ్నాయాలను అన్వేషించడం.. ఉత్తమమని భావించిన దానిని ఎన్నుకోవడమనే.. మూడు అంశా లు ఉంటాయి. ఆ క్రమంలో పూర్వ నిశ్చితాభిప్రాయాలు, భావోద్వేగాలు నిర్ణయా లపై ప్రభావం చూపితే ఆశించిన ఫలితా లు రాకపోవచ్చు. వాటికతీతంగా వాస్తవ పరిస్థితులను, వ్యక్తిగత బలాబలాలను, దృష్టిలో పెట్టుకొని పరిస్థితులను సరిగా అంచనా వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. 

నిర్ణయాలు విలువలకు కట్టుబడి ఉండాలి..

మనం తీసుకోబోయే నిర్ణయం వ్యక్తిగత విలువలకు, లక్ష్యాలకు భిన్నంగా, ప్రాధాన్య క్రమానికి దూరంగా ఉండకూడ దు. ప్రతి సంభావ్యతను లేదా అవకాశాన్ని, ప్రతి ప్రత్యామ్నాయాన్ని అంచనావేసి ప్రయోజనకారియా? లేక నిష్ర్పయోజన మా? అని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఆ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు, స్వల్పకాలిక ప్రయోజనా లు.. పర్యావసానాలు ఎలా ఉంటాయో సరిగా అంచనా వేయాలి.

అవసరమైతే అనుభవజ్ఞుడు లేదా శ్రేయోభిలాషి లేదా సలహాదారుని అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ, నిర్ణయం మనదై ఉండాలి. చేస్తున్న పనినే, చేస్తూ ఉంటే సాధించిన ఫలితాలనే సాధిస్తాం. విభిన్న ఫలితాలను ఆశిస్తే విభిన్నమైన మార్గాలను అన్వేషించాలి. ఉన్నత స్థితిని చేరేందుకు కొత్త పనిని ఆరంభించాలి. ఈ రోజులలో యువతకు అవకాశాలు అనంతంగా ఉన్నాయి. అయితే అవకాశాల వెంట ప్రమాదాలూ ఉంటాయి.

కొందరే ధైర్యంగా కొత్తదనాన్ని ఆరాధిస్తారు. కొత్తమార్గంలో ముందుకు సాగడం వల్ల ప్రమాదం ఎంత? అనిశ్చితం ఎంత? దీని ని నిర్ణయించడంలో సంభావ్యత/ అవకాశాల గుర్తింపు ఉపయుక్త మౌతుంది. అలాగే సంబంధిత సమాచారాన్ని ఆసరా చేసుకొని విశ్లేషణాత్మకంగా ఫలితాలను అంచనా వేయడంలో సంభావ్యతలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇంకా వివిధ అనిశ్చిత పరిస్థితులను అంచ నా వేయడంలో, వాటిని నిర్వహించడంలోనూ ఇవి ఉపయుక్తమవుతాయి.

ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించాలి..

ఒకే మార్గంలో వెళితే ఫలితాలు నిరాశాజనకంగా ఉండవచ్చు. అప్పుడు ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషించాలి. వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల ప్రమాద స్థాయిని అంచ నా వేయడం.. దానిని నివారించుకునే అవకాశాలను పరిశీలించడం సులువు అవు తుంది. ప్రత్యామ్నాయాలు సందర్భానుసారంగా నిర్ణయాలను మార్చుకునేందుకు ఉపకరిస్తాయి.

ఒక నిర్ణయం సాకారం కానప్పుడు మరొక నిర్ణయానికి మారే అవకా శం ప్రత్యామ్నాయాలను అన్వేషించడం వల్ల కలుగుతుంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయాల అన్వేషణలో వ్యక్తి లేదా బృందం సృజనశీలత వెలుగు చూస్తుంది. వివిధ పరిష్కార మార్గాలను మన ముందుంచుతుంది. సంభావ్యతలను, ప్రత్యామ్నాయా లను పరిశీలించిన తర్వాత ఉత్తమమైన నిర్ణయాన్ని ఎంపిక చేసుకోవాలి.

వ్యక్తిగత సమస్యలకు గాని, సంస్థల సమస్యలకు గాని.. ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నప్పుడు, నిర్ణయాలు లక్ష్యాలకు, విలువలకు మధ్య సామరస్యతను నెలకొల్పేందుకు ఉపకరించాలి. నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంచుకునేందుకు ఎంపికలు ఉపకరిస్తాయి. మారుతున్న వాతావరణం లో సంక్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు, సరైన మార్గంలో ప్రయాణించేందు కు ఎంపిక ఉపకరిస్తుంది.

సంభావ్యతలు, ప్రత్యామ్నాయాలు, -ఎంపికలు నిజానికి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవే. వాటిని అవగాహన చేసుకొని సాకారాత్మకంగా ఉపయోగించుకుంటే.. సమస్యను లోతుగా విశ్లేషించి.. వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి వాటి సంభావ్యతలను పరిశీలించి ఒక సమస్యకు పలు పరి ష్కారాలను కనుగొన్న సమయంలో అందులో ఏది ఉత్తమమైనది, ఏది తక్కువ ప్రమాదంతో దరిచేరుస్తుంది.. అనే అంశా న్ని ఎంపిక చేసుకోవచ్చు.

అలాగే వ్యూహాత్మకంగా ప్రణాళికలు వేసుకునేందుకు, వాటిని అమలు చేసే సమయంలో వచ్చే ఇబ్బందులను అంచనా వేసుకునేందుకు, అవకాశం మేరకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో వెళ్లేందుకు.. ఈ విధానం ఉపయుక్తమౌతుంది. అనిశ్చిత పరిస్థితులు ఎదురైన సమయంలో ఒక నిర్ణయానికి ప్రత్యామ్నాయంగా మరొకటి ఉన్నప్పుడు అనుకూలతను ఎన్నుకునేందుకు అవకా శం ఉంటుంది.

నిర్ణయ ఫలితం ఏదైనా వెనుకకు తిరిగి చూసుకోవడం పశ్చాత్తాపడడం అవివేకం. “నదిని దాటించిన తెప్పల ను కాల్చేయండి” అన్నది సైనికుల సామె త. గతాన్ని తవ్వుకోకండి.. వర్తమానాన్ని విస్మరించకండి.