05-05-2025 12:00:00 AM
కరీంనగర్, మే 4 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు జరగకపోవడం, జరిగిన చోట అసలైన లబ్దిదారులకు అన్యాయం జరగడంతో ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు పెంచుకున్నారు.
గూడులేని నిరుపేదలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో మండలానికొక గ్రామాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించి ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఇందిరమ్మ ఇళ్లు ఆశిస్తున్న నిరుపేదలు కాంగ్రెస్ పైరవీకారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఆయా పైరవీకారులు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలపై తమవారికి ఇళ్లు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయ జోక్యం ఉండకూడదంటూ ప్రకటన జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది.
అయితే పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నిలువ నీడలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఇంటి నిర్మాణాలకు ముగ్గుపోసి పునాదులు తీయగా మరికొన్ని గ్రామాల్లో లెంటల్ లెవల్ వరకు నిర్మాణం జరిగింది.
అయితే లబ్దిదారులందరు శరవేగంగా పనులు చేపట్టేందుకు ప్రతి మండలంలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అబ్దిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,48,471 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
వారందరికీ ఒకేసారి ఇల్లు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో తొలి విడతగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామంలో పూర్తిస్థాయిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని 15 మండలాల్లోని 15 గ్రామాల్లో 2027 ఇళ్లు మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసేందుకు కృషి చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదు...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్లు.. ఇల్లు లేని నిరుపేదలను అర్హులుగా ఎంపిక చేయాలి. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదు. మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది, ఎవరైనా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వస్తే తమ దృష్టికి తీసుకురావాలి.
ఇందిరమ్మ ఇళ్ల అబ్దిదారుల ఎంపికలో అవినీతికి ఆస్కారం జరిగి అనర్హులను ఎంపిక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల పేర్లను గ్రామాల్లో డిస్ ప్లే చేయాలి. ఇళ్లు రానివారు నిరాశపడాల్సిన అవసరం లేదు. రెండు నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రారంభమవుతుంది. గ్రామాల్లో అందరు కూర్చుని అర్హతలో అతి పేదవాడికి ఇల్లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర బీసీ సంక్షేను,
రవాణా శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్