9 July, 2026 | 1:58 AM

సిబిల్ స్కోర్ పెంచుకోండిలా..

12-05-2024 12:15 AM

మెరుగుపర్చుకునేందుకు ఆరు చిట్కాలు

మూడంకెల సంఖ్య మీ వ్యక్తిగత ఆర్థిక అవసరాలకు నేడు ఎంతో అవసరం. దానినే సిబిల్ స్కోర్ అంటాం. మీ కొత్త ఇంటికల సాకారానికి రుణం కావాలన్నా, ఈఎంఐలపై కారు కొనాలన్నా,  ఉన్నత విద్యా రుణం తీసుకుంటున్నా, వ్యక్తిగత రుణం అవసరమున్నా... ఇవన్నీ మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటేనే సాధ్యం. వ్యక్తులకు వారి పరపతి చరిత్ర ఆధారంగా రుణ చెల్లింపు సామర్థ్యాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (సిబిల్) విశ్లేషిస్తుంది. ఆ విశ్లేషణ ఆధారంగా 300 నుంచి 900 స్కేలుపై క్రెడిట్ స్కోర్లు ఇస్తుంది. ఈ స్కోరునుబట్టే రుణాలు, క్రెడిట్ కార్డులు మీకు అనుకూలమైన రీతిలో లభిస్తాయి. అధిక స్కోరు ఉంటే మీ పరపతి సామర్థ్యం బాగున్నట్టు. స్కోరు తక్కువగా ఉంటే రుణం పొందడం కష్టసాధ్యమవుతుంది. వచ్చినా వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. రుణ నిబంధనలు మీకు అంత సానుకూలంగా ఉండవు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు పొందాలంటే సిబిల్ స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. 685 దిగువన స్కోరు ఉంటే బ్యాంక్‌లు, నాన్ ఫైనాన్స్ కంపెనీల నుంచి నిధులు పొందడం కష్టమైపోతుంది. అందుచేత మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరడానికి సిబిల్ స్కోరును పెంచుకుంటే మీ పరపతి మెరుగవుతుంది. క్రెడిట్ స్కోరు పెంచుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. త్వరితంగా క్రెడిట్ స్కోరు పెంచుకునే మార్గాలివిగో..

సమయానుగుణ చెల్లింపులు

 మీ క్రెడిట్ స్కోరు ఆరోగ్యకరంగా కొనసాగాలంటే మీకు ప్రస్తుతం ఉన్న నెలవారీ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులు తదితరాలన్నీ నిర్దేశిత సమయానికి చెల్లించడం అత్యంత ప్రధానమైనది. ఇది మీ పరపతి చరిత్రను సానుకూలంగా రూపొందిస్తుంది. క్రెడిట్ స్కోరు ను పెంచుతుంది. మరోవైపు చెల్లింపుల్లో జాప్యం చేస్తే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. మీ రుణాలు, క్రెడిట్ కార్డు బకా యిలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. భవిష్యత్తులో రుణ సదుపాయం పొందే అవకాశం తగ్గిపోతుంది. 

పాత ఖాతాల కొనసాగింపు

మీ పాత క్రెడిట్ కార్డు ఖాతాల్ని చురుగ్గా వాడకపోయినా, వాటిని కొనసాగిస్తే దీర్ఘకాలపు క్రెడిట్ హిస్టరీని మెరుగుపరుస్తాయి. అందుచేత వాటిని మూసివేయకుండా, కొనసాగించడం మెరుగని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పాత ఖాతాలను అట్టిపెట్టుకోవడం మీ క్రెడిట్ లిమిట్ పెరగడానికి దోహదపడుతుంది. దీనితో మీరు వాడుకునే క్రెడిట్ నిష్పత్తి తగ్గుతుంది. ఫలితంగా కొంతకాలానికి క్రెడిట్ స్కోరు పెరుగుతుంది.

పరిమిత వినియోగం

మీకు ప్రస్తుతం ఉన్న రుణ సదుపాయాన్ని తక్కువ నిష్పత్తిలో  విని యోగించుకోవడం క్రెడిట్ స్కోరు మెరుగుకు కీలకం. సాధారణంగా మీ క్రెడిట్ కార్డులపై అందుబాటు లో ఉన్న క్రెడిట్ లిమిట్‌లో 30 శాతంవరకూ వాడటం శ్రేయస్కరం. క్రెడిట్ లిమిట్‌లో అధిక వినియోగం మీకు ఉన్న ఆర్థిక ఒత్తిడికి సంకేతమవుతుంది. క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది. 

క్రెడిట్ స్కోరు పర్యవేక్షణ

మీ ఆర్థిక ప్రగతిని ట్రాక్ చేయడానికి, మెరుగుపర్చుకోవడానికి అవసర మైన మార్గాలను గుర్తించడం కోసం క్రమేపీ మీ క్రెడిట్ స్కోరును పర్యవేక్షించండి. చాలా ఆర్థిక సంస్థలు ఉచితం గా క్రెడిట్ కార్డు పర్యవేక్షణా సేవల్ని అందిస్తున్నాయి. మీ క్రెడిట్ ప్రొఫైల్‌లో ఏర్పడే మార్పుల్ని తెలుసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఈ పర్యవేక్షణతో సమస్యల్ని పరిష్కరించుకుని క్రెడిట్ స్కోరు మెరుగుపర్చుకోగలుగుతారు. 

సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం: 

పరిమితమైన క్రెడిట్ హిస్టరీ కలిగినవారు, తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు ఒక విలువైన సాధనం. బ్యాంక్‌లో సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే దీనిని పొందవచ్చు. ఈ కార్డును వివిధ అవసరాలకు వాడుకుంటూ సమయానికి చెల్లింపులు చేయడం, కార్డు లిమిట్‌లో తక్కువ శాతం వినియోగించడం వంటివాటి ద్వారా మీ పరపతి సామర్థ్యాన్ని పెంచే క్రెడిట్ హిస్టరీ ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో  క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుంది.

మితంగా రుణ దరఖాస్తులు

కొత్త రుణాల కోసం, క్రెడిట్ కార్డుల కోసం తక్కువకాలంలో ఎక్కువగా దరఖాస్తులు వేయడం క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. మీరు వేసే ప్రతీ అప్లికేషన్‌న్‌తో ఆయా బ్యాంకు, ఆర్థిక సంస్థ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీ మీ క్రెడిట్ రిపోర్ట్‌ను సిబిల్ నుంచి తీసుకుంటాయి. అవి ఇలా రిపోర్ట్ తీసుకోవడం తాత్కాలికంగా మీ క్రెడిట్ స్కోరును తగ్గిస్తుంది. కొత్త క్రెడిట్ ఎంక్వయిరీలు తక్కువ ఉంటే మీ పరపతి స్థిరంగా ఉంటుంది. క్రెడిట్ స్కోరు అనవసరంగా హెచ్చుతగ్గులకు లోనుకాదు.