28 May, 2026 | 1:28 AM

బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం

28-05-2026 12:54 AM

తెలంగాణ భవన్‌లో ఉమ్మడి జిల్లా నేతలతో హరీశ్ రావు సమావేశం

సంగారెడ్డి, మే 27 (విజయక్రాంతి): మా జీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు, సమన్వయకర్తలతో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరీష్ రావు గారు పార్టీ  నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పలు సూచనలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు పూర్తి సహకారం అందించుకుంటూ సమన్వయంతో ముందు కు సాగాలన్నారు. నియోజకవర్గాల వారీగా నియమితులైన సమన్వయకర్తలు స్థానిక నాయకత్వంతో మమేకమై, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కొంత సమయం కేటాయించి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈసారి సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.50 రుసుముగా నిర్ణయించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను పార్టీ పూర్తిగా ఆన్లైన్ విధానంలో చేపడుతోంది.

స్పాట్లో లైవ్ ఫోటో తీసుకోవడంతో పాటు ఓటరు వివరాలు కూడా అక్కడే నమోదవుతాయి. దీని ద్వారా మెంబర్షిప్ డ్రైవ్ అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ పూర్తి చేస్తే.. అది రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం ఇప్పటికే 7 స్థానాలు గెలుచుకున్నామని, వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు సాధించేలా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని స్పష్టం చేశారు.

జూన్ మొదటి వారంలో సభ్యత్వ నమోదు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాలని, ఆన్లైన్ నమోదు విధానంపై నాయకులకు, కార్యకర్తలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ నూరు శాతం విజయవంతం కావడానికి స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని  సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి, దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సమన్వయకర్తలు, మెదక్ జిల్లా మెంబర్షిప్ ఇన్చార్జి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.