వడగండ్ల వాన
మారిన వాతావరణం
పిడుగుపడి ఇద్దరు రైతుల మృతి
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
రానున్న 5 రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్, మే౫ (విజయక్రాంతి)/ నెట్‌వర్క్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయం త్రం వర్షం కురిసింది. రోజంతా ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖమ్మం నగరంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల, వలిగొండ, మోత్కూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. దీంతో పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. నల్లగొండ జిల్లా చండూరు, నాంపల్లి, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, నూతనకల్ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలుల ప్రభావంతో మిర్యాలగూడ, హాలియా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. ఈదురుగాలుల కారణంగా మామిడి తోటలకు నష్టంవాటిల్లింది.
పిడుగుపాటుకు..
పిడుగుపాటుకు గురై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరుకు చెందిన దాసరి అజయ్ (23), ములుగు జిల్లా ఏటూరునాగారంలో రైతు బాస బుల్లయ్య దుర్మరణం చెందారు. అడ్డగూడురు మండలం కోటమర్ది గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు చనిపోయాడు. పిడుగులు పడి పలు చోట్ల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.
రాగల 5 రోజుల్లో..
మారాఠ్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దాని ప్రభావంతో రాగల 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించారు. జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదివారం 26 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా మే నెల చివరి వారంలో తీవ్ర స్థాయిలో ఉండే ఉష్ణోగ్రతలు మొదటి వారంలోనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 46.8 డిగ్రీలు నమోదైంది. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలోని రామలక్ష్మణపల్లిలో 20.8 డిగ్రీలు నమోద్లైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 26 జల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలపైనే అధిక ఉప్ణోగ్రతలు నమోదైనట్టు వివరించారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 95 ప్రాంతాల్లో వీచిన వడగాలు, ఆదివారం నాటికి 51 ప్రాంతాలకు తగ్గాయి. మరో మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే.




