వడగండ్లు-కడగండ్లు
దేశవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మార్పు లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు మండిపోవాల్సిన వేసవిలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాల్లో మంచు, పొగ మంచు కురుస్తున్న దృశ్యాలను మనం నేడు చూస్తున్నాం.
ఎండలు ఠారెత్తించాల్సిన ఏప్రిల్ నెలాఖరులో కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మంచు, పొగమంచు కురవడంతో అక్కడ పర్యాటకుల సందడి నెలకొన్నది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ఆకస్మిక మార్పులే కనిపిస్తున్నాయి. భూతాపం మూలంగానే ఇలాం టి వాతావరణ పరిస్థితి నెలకొన్నదని పలువురు నిపుణులు చెప్తున్నారు. ఈ దుస్థితికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని చెప్పక తప్పదు.
ప్రకృతి ప్రసాదించిన వనరులను తన అవసరాలకు వాడుకోవాల్సిన మానవుడు అందుకు విరుద్ధంగా నాశనం చేస్తున్నాడు. అత్యాశతో ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. మొక్కలు నాటకపోగా ఎడాపెడా చెట్లను నరికేస్తున్నాడు. కొండలు, గుట్టలు, చెరువులు, కుంటలను కూడా వదలడం లేదు. ఈ కారణంగానే ఏటా భూ వాతావరణం వేడెక్కుతున్నది. వాహనాల కారణంగా ఏటికేడు కాలుష్యమూ అమాంతం పెరుగుతోంది. దీంతో ధ్రువ ప్రాంతాల వద్ద మహాసముద్రాల్లోని భారీ మంచు ఫలకాలు కరుగుతున్నాయి.
దీంతో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. అందులో భాగంగా ముంచుకొస్తున్న ఎల్ నినో ప్రభావం ఇప్పటినుంచే మనకు కనిపిస్తోంది. మండువేసవిలో పొగమంచు, వడగండ్ల వానలు కురవడమే అందుకు తార్కాణమని చెప్పవచ్చు. వడగండ్ల వాన వల్ల ఉమ్మడి నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాల్లోని కర్షకులు కడగండ్లపాలయ్యారు. ఇది అసలే కోతల కాలం. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. ఇప్పుడిప్పుడే రైతన్నలు కోతలు షురూ చేస్తున్నారు.
వరి పంట కోసి మార్కెట్లకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఇంకా వేల ఎకరాల్లో పంట కల్లాల్లోనే ఉన్నది. వడగండ్ల దెబ్బకు ధాన్యం గింజలు నేలరాలడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. మార్కెట్లలో, రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసుకున్న రైతుల బాధ వర్ణనాతీతం. మక్కలు, మామిడి రైతులూ లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో మరో రెండు, మూడు అకాల వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఆ హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వం చెవిన పడ్డాయో, లేదో మరి!






