21 April, 2026 | 2:00 AM

యువతలోనే గుండెపోటు మరణాలు ఎక్కువ

21-04-2026 12:00 AM

ఒకప్పుడు గుండెపోటు వృద్ధులకు మాత్రమే సంబంధించిన అనారోగ్యంగా భావించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 18- 45 ఏళ్ల మధ్య వయస్కులలో గుండెపోటు మరణాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. హర్యాణా ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. హర్యానాలో గత ఆరేళ్లలో 18 వేల మంది ఈ వయసు వారు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్నది.

ఏటా మరణాలు పెరుగుతున్న ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాజిక నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం జీవనశైలి. టెక్నాలజీ యుగంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. కార్యాలయాల్లో గంటల తరబడి కూర్చుని పని చేయడం, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం వల్లే గుండె బలహీనపడుతోంది. అహారపు అలవాట్లు కూడా ఒక కారణమే. ఫాస్ట్ ఫుడ్, కల్తీ ఆహారం, అర్ధరాత్రి భోజనం చేయడం లాంటి అలవాట్లు రక్తపోటును పెంచుతున్నాయి.

పొగతాగడం, మద్యపానం వీటికి ఆజ్యం పోస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో తీవ్రమైన పోటీ, ఆర్థిక ఒత్తిడి, సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్లో ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాలుష్యం, పని ఒత్తిడి, నిద్రలేమి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈ ధోరణి మరింత పెరిగిందనే అనుమానాలు ఉన్నాయి. వైరస్ లేదా వ్యాక్సిన్‌తో సంబంధం ఉందా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయ అధ్యయనాలు చేసి సత్వరమే సమాధానం ఇవ్వాలి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వాలు చురుకైన చర్యలు తీసుకోవాలి. స్కూల్, కాలేజీలు, కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాలో కార్డియాక్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఉచిత పరీక్షలు చేయాలి. అదే సమయంలో వ్యక్తిగతంగా మనమూ బాధ్యత తీసుకోవాలి. 

   దయ్యాల అశోక్, 95508 89907