16-12-2025 01:45:24 AM
విజయక్రాంతి పత్రిక వాస్తవాలను వెల్లడిస్తూ, హ్యామ్ పథకంపై గతంలోనే తీవ్రంగా హెచ్చరించింది. దీనిని పచ్చి మోసంగా పేర్కొంది. ఈ మోడల్ వల్ల కాంట్రాక్టర్ల ఖర్చులు పెరుగుతాయి.. చివరికి భారం మొత్తం ప్రజల మీదే పడుతుంది. హ్యామ్‌లో కాంట్రాక్టర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందడమే కాకుండా, 15 సంవత్సరాల పాటు లాభాలు కూడా పొందుతారు. అంటే పన్నుల రూపంలో వచ్చే ప్రజల డబ్బు ప్రైవేట్ సంస్థలకు దీర్ఘకాలిక సబ్సిడీగా మారిపోతుంది.
* హ్యామ్ లాంటి మోడళ్లకు ప్రభుత్వం తప్పకుండా సకాలంలో చెల్లింపులు చేస్తుందనే నమ్మకం అవసరమని ఆర్థిక విధాన నిపుణులు చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వ విషయంలో ఆ నమ్మకం దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది. ఈ టెండర్లకు ఒక్క బిడ్ కూడా రాకపోవడమే ఇందుకు స్పష్టమైన నిదర్శనం. దీని ద్వారా కేవలం రాష్ట్రం పరువు మాత్రమే పోవడం కాదు.. వ్యవస్థలో లోతైన సమస్యలున్నాయని సూచించే హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
* తెలంగాణలోని చిన్న కాంట్రాక్టర్లను బయట రాష్ట్రాల పెద్ద కాంట్రాక్టర్లకు సబ్‌కాంట్రాక్టర్లుగా పరిమితం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా, ఈ పరిస్థితి కొనసాగుతుండటం బాధాకరం. ఇది ఒక రకంగా ఆర్థిక బానిసత్వాన్నే కొనసాగిస్తున్నట్టు ఉంది. అందుకే పాలసీ నిర్ణేతలు స్థానిక కాంట్రాక్టర్లను టెండర్ ప్రక్రియలో భాగం చేయాలి. ప్రత్యేక కోటాలు, జాయింట్ వెంచర్లు వంటి మార్గాలను అనుసరించి సమానమైన అభివృద్ధిని ప్రోత్సహించాలి. స్థానికేతర సంస్థలపై ఆధారపడటం తగ్గించాలి.
* ప్రభుత్వం హ్యామ్ విధానాన్ని వదిలి ఈపీసీ(ఇంజినీరింగ్, ప్రొకూర్‌మెంట్, కన్ట్స్రక్షన్) మోడల్‌కు రావాలి. ఈపీసీ మోడల్‌లో ప్రభుత్వం నేరుగా పనులు చేపడుతుంది. బడ్జెట్ నుంచే చెల్లింపులు జరుగుతాయి. ఈ విధానం మొదట ఖర్చు ఎక్కువగా అనిపించినా 15 ఏళ్ల భవిష్యత్ భారం ఉండదు. దీర్ఘకాల అప్పుల భారం లేకుండా గ్రామీణ అవసరాలు నెరవేరుతాయి.
* ఈ వ్యవహారంతో రూ. 30 వేల కోట్లు ప్రమాదంలో ఉన్నందున అప్పుల భారం కాకుండా రహదారులు నిర్మించే మోడల్‌ను స్పష్టంగా ఎంపిక చేసుకోవాలి. సమయానికి తగిన నిర్ణయాలు, మార్పులు చేయకపోతే ఈ వ్యవహారం తెలంగాణ చరిత్రలో ఆర్థిక అవివేకానికి చిహ్నంగా నిలిచిపోవచ్చు.
మౌలిక వసతుల అభివృద్ధి రంగంలో తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 20 వేల కోట్ల విలువైన గ్రామీణ రహదారుల ప్రాజెక్టును హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) ద్వారా చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పథకాన్ని భారీ ప్రచారంతో ప్రకటించారు. సినీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తరహాలో గొప్పగా గ్రామీణ రహ దారులు మారిపోతాయని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన సమస్యలు బయటపడుతున్నాయి. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
వ్యూహాలను మళ్లీ పరిశీలించుకోవాల్సిన అవస రం ఉంది. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే ఈ ‘హ్యామ్’ పథకం ప్రభుత్వ ఖజానాను, బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసే ‘ఆర్థిక గుదిబండ’గా మారే ప్రమాదం ఉంది. ‘హ్యామ్’ ఒక పబ్లిక్ భాగస్వామ్య విధానం. ఇందులో కాంట్రాక్టర్లు తమ సొంత పెట్టుబడి పెడతారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ప్రభుత్వం కొంత మొత్తాన్ని గ్రాంట్‌గా ఇస్తుంది.
రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత 15 సంవత్సరాల పాటు ప్రభుత్వం అన్యుటీ రూపంలో చెల్లింపులు చేస్తుంది. ఆ డబ్బుతో కాంట్రాక్టర్లు బ్యాంక్ రుణాలు చెల్లిస్తారు. కాగితాల మీద చూస్తే ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఖర్చులు విడతలుగా చెల్లించడం, ప్రైవేట్ పెట్టుబడిని ఉపయోగించుకోవడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇలాంటి మోడళ్లకు ప్రభుత్వం తప్పకుండా సకాలంలో చెల్లింపులు చేస్తుందనే నమ్మకం అవసరమని ఆర్థిక విధాన నిపుణులు చెబుతున్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వ విషయంలో ఆ నమ్మకం దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది. ఈ టెండర్లకు ఒక్క బిడ్ కూడా రాకపోవడమే ఇందుకు స్పష్టమైన నిదర్శనం. దీని ద్వారా కేవలం రాష్ట్రం పరువు మాత్రమే పోవడం కాదు.. వ్యవస్థలో లోతైన సమస్యలున్నాయని సూచించే హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
అరచేతిలో వైకుంఠం..
గ్రామీణ ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం భారీ ప్రచా రం చేసింది. ఫోటోలు, అద్భుతమైన గ్రామీణ రహదారుల చిత్రాలతో ‘అరచేతిలో వైకుంఠం’ చూపించినట్టుగా ప్రచారం సాగింది. వాస్తవంగా చేసిన పనికన్నా వర్చువల్ హామీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పద్ధతికి ప్రతిబింబంగా నిలిచింది. అయితే ఇది వారి రాజకీయ గురువుల నుంచి నేర్చు కున్న పాఠమా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే విజయక్రాంతి పత్రిక వాస్తవాలను వెల్లడిస్తూ, హ్యామ్ పథకంపై తీవ్రంగా హెచ్చరించింది.
దీనిని పచ్చి మోసంగా పేర్కొంది. ఈ మోడల్ వల్ల కాంట్రాక్టర్ల ఖర్చులు పెరుగుతాయి, చివరికి భారం మొత్తం ప్రజల మీదే పడుతుంది. హ్యామ్‌లో కాంట్రాక్టర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందడమే కాకుండా, 15 సంవత్సరాల పాటు లాభాలు కూడా పొందుతారు. అంటే పన్నుల రూపంలో వచ్చే ప్రజల డబ్బు ప్రైవేట్ సంస్థలకు దీర్ఘకాలిక సబ్సిడీగా మారిపోతుంది. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ.. నియం త్రణలేని ఖర్చులకు ఇది దారితీస్తుందని హెచ్చరించింది.
ప్రభుత్వం చేయాల్సిందేమిటి..?
అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలనే ప్రశ్నకు చాలా సరళమైన సమాధానమే ఉంది. ప్రభుత్వం ముందుగానే ఇండస్ట్రీ నిపుణుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తాజాగా రాష్ట్రంలో జరిగినట్టు నిపుణుల సలహాలను పట్టించుకోకపోతే ప్రాజెక్టులు ఆలస్యం అవడమే కాదు, ప్రభుత్వ విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది. స్థానికంగా అనుభవం ఉన్న, యంత్రాలు ఉన్న చిన్న గ్రామీణ కాంట్రాక్టర్ల మౌనం చాలా విషయాలను చెప్పకనే చెబుతోంది. చిన్న కాంట్రాక్టర్లను బయట రాష్ట్రా ల పెద్ద కాంట్రాక్టర్లకు సబ్‌కాంట్రాక్టర్లుగా పరిమితం చేస్తున్నారు.
స్థానిక సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అవకాశాన్ని కోల్పోవడానికి ఇది నిదర్శనం. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా, ఈ పరిస్థితి కొనసాగుతుండటం బాధాకరం. ఇది ఒక రకంగా ఆర్థిక బానిసత్వాన్నే కొన సాగిస్తున్నట్టు ఉంది. అందుకే పాలసీ నిర్ణేతలు స్థానిక కాంట్రాక్టర్లను టెండర్ ప్రక్రియలో భాగం చేయాలి. ప్రత్యేక కోటాలు, జాయింట్ వెంచర్లు వంటి మార్గాలను అనుసరించి సమానమైన అభివృద్ధిని ప్రోత్సహించాలి. స్థానికేతర సంస్థలపై ఆధారపడటం తగ్గించాలి.
అప్రమత్తతకూ కారణముంది..
టెండర్లు విఫలమవడం అనేది ఆర్థిక ప్రణాళికకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. బ్యాంకులు ఈ ప్రాజెక్టులపై జాగ్రత్తగా వ్యవహరిస్తుండటం సహజమే. ఎవరూ తమను ‘దివాలా దిశగా’ నడిపించే ప్రాజెక్టులకు ని ధులు ఇవ్వరు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, బడ్జెట్‌పై మాత్రమే ఆధారపడే పథకాలకు ప్రత్యేక ఆదాయ మార్గం లేకుండా నేరుగా రుణాలు ఇవ్వడానికి అనుమతి లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం నిధుల సేకరణ, రీపేమెంట్లు, వడ్డీ నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొ రేషన్ ఏర్పాటు చేయకుండా విస్మరించింది.
ఇది సాధారణంగా బడ్జెట్ ఒడిదుడుకుల నుంచి ప్రాజెక్టులను రక్షించే పద్ధతి. గ్రామీణ రహదారులపై టోల్ వేయడం సాధ్యం కాదు. అలా చేస్తే గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందువల్ల అన్యుటీలు పూర్తిగా రాష్ర్ట బడ్జెట్‌పై ఆధారపడతాయి. గతంలో భూములు అమ్ముకుని ప్రభుత్వాన్ని నడిపిన పరిస్థితులను చూసిన బ్యాం కులు, ఈసారి బలమైన ఆదాయ మోడల్ లేకుండా ముందుకు రావడానికి సిద్ధంగా లేవు. సలహా కోణంలో చూస్తే ఇది ఆర్థిక అధికారులకు ఒక బోధనాత్మక సందర్భం.
హ్యామ్ టెండర్లు పిలవడానికి ముందే బ్యాం కుల సామర్థ్యం, రుణాల లభ్యతపై సంపూర్ణ పరిశీలన(డ్యూ డిలిజెన్స్) చేయాల్సింది. ఆర్బీఐతో ముందుగానే చర్చించి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలి. రీపే మెంట్ భరోసా పూర్తిగా, పక్కాగా ఉన్నప్పుడే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు బడ్జెట్ నుంచి అన్యుటీ చెల్లింపులు చేస్తామనే హామీ ఇవ్వడం ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఒత్తిళ్ల మధ్య సరైనదిగా అనిపించడం లేదు.
దీని ద్వారా రాబోయే ప్రభుత్వాలపై భరించలేని అప్పుల భారం పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది. ప్రభుత్వం హ్యామ్ విధానాన్ని వదిలి ఈపీసీ(ఇంజినీరింగ్, ప్రొకూర్‌మెంట్, కన్ట్స్రక్షన్) మోడల్‌కు రావా లి. ఈపీసీ మోడల్‌లో ప్రభుత్వం నేరుగా పనులు చేపడుతుంది. బడ్జెట్ నుంచే చెల్లింపులు జరుగుతాయి. ఈ విధానం మొదట ఖర్చు ఎక్కువగా అనిపించినా 15 ఏళ్ల భవిష్యత్ భారం ఉండదు. దీర్ఘకాల అప్పుల భారం లేకుండా గ్రామీణ అవసరాలు నెరవేరుతాయి.
రాజకీయ లెక్కలు..
వాస్తవానికి హ్యామ్ మోడల్ వెనుక ఉన్న రాజకీయ లెక్కలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే రూ. 30 వేల కోట్ల ప్రాజెక్టుల వెనుక ఎన్నికల ప్రచారం, కమీషన్లు, లాభాలు, ఇతర ‘ప్రయోజనాలు’ ఉ న్నాయనే ఊహాగానాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. టెండర్లు విఫలమైతే అంద రి వేళ్లు ముందస్తు ప్రణాళికలో తప్పిదాలనే చూపిస్తాయి. అందుకే ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
టెండర్ ప్రక్రియపై పబ్లిక్ ఆడిట్లు తప్పనిసరి చేయాలి. సలహాదారులు ఇచ్చిన సూచనలు బహిర్గతం చే యాలి. ఐఏఎస్ అధికారులైనా, ఫైనాన్స్ టీమ్ అయినా, ప్రాజెక్ట్ బాధ్యులైనా ఇ లాంటి తప్పిదాలకు బాధ్యత వహించేలా చేయాలి. అలా చేస్తే భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. లేకపోతే ప్రజల విశ్వాసం మ రింత తగ్గి, విచారణలు జరపాలనే డిమాండ్ పెరుగుతుంది.
నిబంధనలు పాటించాలి..
బ్యాంకులు కూడా ఆర్బీఐ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రత్యేకంగా ని ధులు కేటాయించిన సంస్థ (రింగ్-ఫెన్డ్స్ ఎంటిటీ) లేకుండా హ్యామ్ ప్రాజెక్టులకు ని ధులు ఇవ్వడం ‘నాన్- పర్ఫార్మింగ్ ఆసెట్స్’గా మారే ప్రమాదం ఉంది. ఆస్తులు అమ్ముకుని నడిచే రాష్ట్రాల్లో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. బలమైన హామీలు ఉన్న ప్పుడే నిధులు ఇవ్వాలి.
అధిక ప్రమాదం ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి బ్యాంకులు తమ పెట్టుబడులను వైవిధ్యీకరించాలి. కన్సల్టెంట్లు, నిపుణులు, ప్రజలందరూ కలిసి వ్యవస్థాగత సంస్కరణల కోసం డిమాండ్ చే యాలి. చిన్న కాంట్రాక్టర్లు ఈ పరిస్థితిలో ని స్సహాయంగా ఉన్నారు. వారు భయపడకుండా తమ సమస్యలు చెప్పుకునేలా అసో సియేషన్ల ద్వారా వేదికలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది.
పద్ధతి మార్చుకుంటుందా..?
అయితే భవిష్యత్‌లో తెలంగాణ ప్రభు త్వం ఈ విషయంలో దిశ మార్చుకుంటుం దా లేదా అనేది కాలమే జవాబు చెప్పాలి. ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులో ఉంది. ఈపీసీ మోడల్‌లో టెండర్లను మళ్లీ పిలవాలి. బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా పారదర్శకంగా విడతలవారీగా ప్రకటించాలి. భవిష్యత్‌లో హ్యామ్ అమలుచేయాలంటే ప్రత్యేక రహదారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే ఈ ప్రాజెక్టును కాపాడుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఫోటోలకు మాత్రమే పరిమితమయ్యే ప్రచారం కాకుండా, వాస్తవంగా గ్రామీణ రహదారులు నిర్మించే దిశ గా ముందుకెళ్లవచ్చు.
మౌలిక వసతుల అభివృద్ధి అంటే ఆర్భాటం కాదు, దీర్ఘకాలిక ప్ర యోజనం. ఈ పాఠాలను గమనిస్తే, హ్యా మ్‌ను నియంత్రణ లేకుండా కొనసాగిస్తే వ చ్చే దివాళా ప్రమాదాలను తప్పించుకొని, తెలంగాణ నిజమైన అభివృద్ధి దారిని సుత్తి తో చెక్కినట్టుగా నిర్మించగలదు. వాస్తవానికి ప్రజల ఆకాంక్షలకు, వాస్తవికత మధ్య సమతుల్యత అవసరం ఉంది. ప్రభుత్వాలు విస్తృతంగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. బ్యాంకులు తమ నిధులను రక్షించుకోవాలి. ప్రజలు తమ బాధ్యతను డిమాండ్ చేయాలి.
ఈ వ్యవహారంతో రూ. 30 వేల కోట్లు ప్రమాదంలో ఉన్నందున అప్పుల భారం కాకుండా రహదారులు నిర్మించే మోడల్‌ను స్పష్టంగా ఎంపిక చేసుకోవాలి. సమయానికి తగిన నిర్ణయాలు, మార్పులు చేయకపోతే ఈ వ్యవహారం తెలంగాణ చరిత్రలో ఆర్థిక అవివేకానికి చిహ్నంగా నిలిచిపోవచ్చు. ఇది భారతదేశ అభివృద్ధి గాథలో వివేకవంతమైన పాలన ఎంత అవసరమో మరోసారి గుర్తుచేస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఆర్బీఐ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోకుండా, అవసరమైన జాగ్రత్తలు పాటించకుండా టెండర్లు సిద్ధం చేసిన తీరు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సలహాదారులు, కన్సల్టెంట్లు, సాంకేతిక, లీగల్, ఫైనాన్స్ నిపుణులు, అలాగే సీనియర్ బ్యూరోక్రాట్లు అం దుబాటులో ఉన్నప్పటికీ ఇంత పెద్ద లోపం ఎలా జరిగిందన్నదే ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి