16-12-2025 01:36:19 AM
ఎల్లారెడ్డిలో ఓడిన అభ్యర్థి ఇంటిపై దాడి
పల్లెల్లో చిచ్చు మొదలు!
ఎల్లారెడ్డి, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసి, ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు.. గ్రామంలోని ప్రత్యర్థి ఇంటి వద్ద ఉన్న ప్రజల మీదికి ట్రాక్టర్‌ను ఎక్కించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఓ బాలుడికి కాలు విరిగింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సోమార్‌పేట సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి కురుమ పాపయ్య విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దావత్ ప్రదేశానికి పొలం వద్దనున్న ట్రాక్టర్‌ను తేవాలని తన తమ్ముడైన కురుమ చిరంజీవిని పంపించాడు. చిరంజీవి ట్రాక్టర్‌ను తీసుకువచ్చే క్రమంలో ఓడిన సర్పంచ్ అభ్యర్థి(బీఆర్‌ఎస్) బాలరాజు ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. అయితే ఓడిపోయిన బాలరాజును ఓదార్చడానికి వచ్చిన గ్రామస్థులు ఆ ఇంటి వద్ద పెద్దఎత్తున గుమ్మిగుడి ఉన్నారు.
వారిని చూసిన చిరంజీవి.. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా, ఓటు వేయలేదనే కోపంతో ట్రాక్టర్‌తో ఆ గుంపు మీదకు దూసుకెళ్లాడు. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. మిగతా ముగ్గురిని ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు. గాయపడిన వారిలో గంజి భారతి, తోట శారద, బాలమణి, సత్యవ్వ, బాలుడు గండి అద్విత్ ఉన్నారు. వీరిలో గంజి భారతి, తోట శారద పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. గంజి భారతి వెన్నుపూసకు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాలుడికి కాలు విరిగింది.
సర్పంచ్ ఇంటిపై గ్రామస్థుల దాడి
ఈ సంఘటనతో క్రోపోదిక్తులైన గ్రామస్థులు మూకుమ్మడిగా సర్పంచ్ కురుమ పాపయ్య ఇంటి పైకి దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. గెలిచి 24 గంటలు కూడా కాకముందే ఇంత అరాచకమా అని బీఆర్‌ఎస్ అభ్యర్థి బాలరాజు, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు నిలదీశారు. సర్పంచ్‌ను వెంటనే తొలగించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు.
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డి చేరుకొని ప్రజలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి బాలరాజుపై దాడికి ప్రయత్నించిన వారికి శిక్ష విధించాలని కోరారు. ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నిందితుడిపై హత్యాయత్నం కేసు
ట్రాక్టర్ తో ఢీ కొట్టి చంపాలని చూసిన వ్యక్తిపై అత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ తెలిపారు. బీఆర్‌ఎస్ మద్దతుతో బాలరాజు నామినేషన్ వేసినప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కుర్మా పాపయ్య, అతని తమ్ముడు కురుమ చిరంజీ వి, కుటుంబ సభ్యులు కురుమ సాయి బా బా, కురుమ శంకర్, కురుమ స్వప్న, కురుమ లత, కురుమ శోభ, మరియు కుర్మా దుర్గవ్వ బాలరాజును, అతని కుటుంబ సభ్యులను, మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
తమకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని మీరు ఎన్నికల్లో ఓడిపోతే మీ అంతు చూస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఈ క్రమం లోనే ఆదివారం చిరంజీవి ట్రాక్టర్‌ను బాలరాజు మద్దతుదారులపైకి దూసుకెళ్లాడని వెల్లడించారు. బాలరాజు ఫిర్యాదు మేరకు నిందితుడు చిరంజీవిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ తెలిపారు.
బాధితులకు న్యాయం చేయాలి: కేటీఆర్
సోమార్‌పేట గ్రామంలో జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాజుకు సహాయ సహకారాలు అందించి, అండగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ఫోన్‌లో ఆదేశించారు. కాంగ్రెస్‌కు ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోయిందని, అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు.
బరిలో నిలిస్తే బలిగొంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని పార్టీ నాయకులు పాటుపడాలని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్రకు స్వయంగా ఫోన్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మూడో విడతకు ముగిసిన ప్రచారం
రేపు పోలింగ్
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ విడతలో మొత్తం 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీలకు, 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 12,640 మంది సర్పంచ్ అభ్యర్థులు.