8 July, 2026 | 2:01 AM

పోగొట్టుకున్న 117 మొబైల్స్ అప్పగింత

08-07-2026 12:00 AM

సిద్దిపేట క్రైం, జూలై 7: చోరీకి గురైన, పోగొట్టుకున్న 117 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్(సీఈఐఆర్) పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. చరవాణి పోగొట్టుకుంటే ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి తిరిగి పొందవచ్చని సూచించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రికవరీ చేసి, మంగళవారం పోలీస్ కమిషనరేట్ లో వాటిని యజమానులకు అప్పగించారు.

వాటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 538 చరవాణిల రికవరీ చేసి బాధితులకు అందజేసినట్టు చెప్పారు. మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఈఐఆర్ బృందం, ఇన్స్పెక్టర్ మొగిలి, కానిస్టేబుల్ రమేష్, రాజిరెడ్డి, హరికృష్ణ, స్వామి, శ్రీకాంత్ లను సీపీ అభినందించారు.