3 March, 2026 | 3:57 AM

సీవోఈలో హర్భజన్, కుంబ్లే సేవలు

03-03-2026 12:00 AM
  1. యువ స్పిన్నర్లకు మార్గనిర్దేశం 
  2. ఐదు రోజులపాటు రెడ్‌బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు

బెంగళూరు, మార్చి 2: భారత క్రికెట్ దిగ్గజ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ యువక్రికెటర్లకు తర్ఫీదు ఇవ్వబోతున్నారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సీవోఈ)లో యువ స్పిన్నర్లకు వీరు మార్గనిర్దేశం చేయనున్నారు. స్పిన్ బౌలింగ్ లో మెళకువలు నేర్పించనున్నారు. తాజాగా హర్భజన్ సింగ్ బీసీసీఐ సీవోఈలో చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మరో భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఫాస్ట్ బౌలర్లతో పని చేస్తున్నాడు.

బీసీసీఐ మార్చి మొదటి వారంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రెడ్ బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు ఉండనున్నాయి. ఈ శిబిరాలు అండర్-19, ఇండియా A జట్లలో ప్రతిభ చూపి న ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వీరిని త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.

కాగా ఆల్టైమ్ గ్రేట్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిస్ట్ స్పిన్నర్ల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఈ మొత్తం కార్యక్రమాన్ని మరో భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సమన్వయం చేస్తున్నారు. ఇతర మాజీ ఆటగాళ్లను కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి అతను సంప్రదింపులు జరుపుతున్నాడు.  గతంలో జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మాజీ ఆటగాళ్లను యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఆహ్వానించే పద్ధతి మొదలైంది.