01-12-2025 12:55:23 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు రైతుభరోసా(Rythu Bharosa) ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా(Khammam district) నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరన్నారు. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నానంటూ వీరన్న సెల్ఫీ వీడియో(Selfie video) రేవంత్ రెడ్డి సర్కార్ రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనమన్నారు. వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే బతుకులు భారమై రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ద్వజమెత్తారు.
ఎన్నికలకు ముందు కౌలు రైతులకు(Koulu Rythu) రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గమని హరీశ్ రావు మండిపడ్డారు. రైతులు పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వీరన్న సెల్ఫీ వీడియోతోనైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు? అంటూ హరీశ్ రావు ప్రశ్నలు సందించారు.
రేపటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉందని హామీ ఇచ్చారు. రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని ధైర్యం చెప్పారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని హరీశ్ రావు పేర్కొన్నారు.