01-12-2025 12:46:50 PM
అటవీశాఖ అప్రమత్తం, గ్రామంలోడప్పు చాటింపు.. ప్రజల్లో ఆందోళన
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల పరిధిలో పెద్ద పులి సంచరిస్తుందనే విషయాన్ని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. ఇటీవల కృష్ణపల్లి గ్రామానికి సమీప అటవీ ప్రాంతంలో పులి అడుగుల జాడలు, చలనం స్పష్టంగా కనిపించడంతో అధికారులు వెంటనే గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తత చర్యల భాగంగా కృష్ణపల్లి గ్రామంలో డప్పు చాటింపు ద్వారా ప్రజలకు సమాచారం అందించారు.
పులి సంచారం ఉన్న నేపథ్యంలో అడవిలోకి ఒంటరిగా వెళ్లకుండా ఉండాలని, రాత్రి వేళల్లో బయటకు రావడం తగ్గించాలని అధికారులు సూచించారు. పశువులను కూడా అడవి అంచుల వద్ద మేపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అటవీశాఖ ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించి పులి కదలికలపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పోలీసులు, అటవీ సిబ్బంది సంయుక్తంగా పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.