01-12-2025 12:53:15 PM
చివ్వెంల,(విజయక్రాంతి): దూరాజ్‌పల్లి ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మద్యం అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. TG 29 T 0002 నంబర్ గల ఎర్టిగా కారును ఆపి పరిశీలించగా, ఎటువంటి అనుమతులు లేకుండానే 11 కాటన్ బాక్సుల్లో ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్ ను సూర్యాపేట నుంచి మున్యా నాయక్ తండాకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
కారులో ఉన్న డ్రైవర్ ధారవత్ సైదా, మరియు మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి ధరవాత్ నాగును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. పంచనామా నిర్వహించిన అనంతరం మద్యాన్ని, వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ మద్యం మొత్తం 528 క్వార్టర్ బాటిల్స్, వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. సమీపిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా గ్రామాల్లో, ఇండ్లలో, షాపుల్లో మద్యం నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయం చేయడం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చివ్వెంల ఎస్సై వి. మహేశ్వర్ హెచ్చరించారు.