23 March, 2026 | 10:34 PM

భట్టి మాటలకు అర్థాలే వేరులే

23-03-2026 03:36 PM

ఎకరాకు రూ. 15 వేలు రైతుభరోసా ఇవ్వాలి

ఎన్నికలప్పుడు మాత్రమే.. రైతు భరోసా, పంటల బోనస్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని ఈ ప్రభుత్వం ఎన్నికల అజెండాలో,తొలి బడ్జెట్ లో పెట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... రూ. 15 వేలు ఇస్తామని చెప్పి.. రూ. 12 వేలకు తగ్గించారని ఆరోపించారు. మూడో పంటకు రైతుబంధు ఇవ్వాలని అడిగిన రేవంత్ రెడ్డి ఒక సీజన్ కే ఇస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. 

ఒక సీజన్ రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకున్నారని హరీశ్ రావు విమర్శించారు. మొదటి బడ్జెట్ లో పెట్టినట్లే ఎకరాకు రూ. 15 వేలు చొప్పున రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే .. రైతు భరోసా, పంటల బోనస్ ఇస్తున్నారని ఆరోపించారు. రెండు బడ్జెట్ లలో పెట్టిన పంటల బీమా ఈ బడ్జెట్ లో మాయమైందన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ, 12 వేలు ఇస్తామని రెండు బడ్జెట్ లలో పెట్టారు.. ఒక్కసారి కూడా ఇవ్వలేదన్నారు. జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రారంభిస్తామని గత బడ్జెట్ లో చెప్పారు, జాబ్ క్యాలెండర్ గురించి ఈసారి ప్రస్తావనే లేదన్నారు. అశోక్ నగర్ లో ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులపై లాఠీ ఛార్జి చేశారని గుర్తుచేశారు. 

ప్రభుత్వం రుణమాఫీపై అనేక లెక్కలు చెప్పిందన్న హరీశ్ రావు తెలంగాణలో వేలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం గత బడ్జెట్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకున్నట్లు కనిపించడం లేదన్నారు. గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అనేక హామీలిచ్చారు. ప్రభుత్వ వచ్చి రెండున్నరేళ్లు గడిచినా గ్యారెంటీ హామీలు ఎందుకు అమలు కావడం లేదన్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా పరిస్థితి ఉందని ఆరోపించారు.  మార్పు మార్పు అంటూ కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని ఆయన మండిపడ్డారు. కరోనా సమయంలోనూ బీఆర్ఎస్ రైతుబంధు ఇచ్చిందని పునరుఘ్టంటించారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్ల సమయంలో రైతుబంధు వచ్చేది, ఇప్పుడు ధాన్యం ఇంటికి వచ్చినా రైతు భరోసా రావడం లేదని విమర్శించారు.