నా కుటుంబానికి ఎమ్మెల్యేతో హాని
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శివకుమార్ బాధితుడు సుధాకర్ ఫిర్యాదు
హైదరాబాద్, మే 14: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శివకుమార్ బారి నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని చెంప దెబ్బ బాధితుడు గొట్టుముక్కల సుధాకర్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రంలో తనపై దాడి చేయడంపై ఎమ్మెల్యే శివకుమార్‌తో పాటు ఆయన అనుచరులు ఏడుగురిపై సుధాకర్ ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఘటన విషయాలను వెల్లడించారు. తెనాలి ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు పోలింగ్ బూత్‌లోకి వెళ్లినప్పుడు తాను, ఇతర ఓటర్లు క్యూలో ఉన్నామని చెప్పారు.
అందరూ క్యూలో నిలబడే ఓటు వేయాలని, ఎవరికీ ప్రత్యేక హక్కులు లేవని తాను చెప్పడంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారని వివరించారు. క్షణికావేశంలో తాను ఎదురు తిరిగినట్లు తెలిపారు. నేను ఓటు వేయకుండా వెళ్లనని చెప్పడంతో, తనను ఎగ్జిట్ గేట్ నుంచి లోపలికి తీసుకెళ్లి ఓటు వేయించారని వెల్లడించారు. తాను నిబంధనలు పాటించమని చెప్పినందుకే వారు తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం భద్రతపై ఆందోళన ఉందని, తన తల్లికి, కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.




