calender_icon.png 1 February, 2026 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెడ్, నెక్ ఆంకాలజీ సమ్మిట్

01-02-2026 03:21:37 AM

500 మందికిపైగా ఆంకాలజిస్టులతో యశోద ఆస్పత్రిలో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): యశోద హాస్పిటల్స్ -హైటెక్ సిటీ, ఆంకాలజీ విభాగం నిర్వహించిన అంతర్జాతీయ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ సమ్మిట్-2026 సదస్సు ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపం చ నలుమూలల నుంచి 500 మందికి పైగా ఆంకాలజీ వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌ను అత్యంత ఖచ్చితత్వంతో ముందస్తుగా గుర్తించడం కోసం ఏఐ- ఆధారిత హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ క్లినిక్‌ను ప్రారంభించారు.

ఈ క్లినిక్ రోగి జన్యు పరమైన, మాలిక్యులర్ ప్రొఫైల్‌ను విశ్లేషించ డం ద్వారా, ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన చికిత్సను రోబోటిక్ సర్జరీ, టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యునోథెరపీ వంటి ఏఐ -ఆధారిత చికిత్స ప్రణాళికను అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ క్లినిక్ వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ సంరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. ఎస్.రావు అన్నారు.

కమిషనర్ రమేష్ మాట్లాడుతూ.. తల, మెడ క్యాన్సర్లు భారతదేశంలోని మొత్తం క్యాన్సర్ కేసులలో సుమారు 30%గా ఉన్నాయన్నారు. సంవత్సరానికి 2.25 లక్షల కొత్త కేసులు, 1.25 లక్షల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. భారతదేశం లో 50 ఏళ్ల వయస్సు వారిలో ఈ  క్యాన్సర్ సర్వసాధారణంగా ఉన్నప్పటికీ, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనదేశంలో అధిక శాతం మంది రోగులు చిన్న వయస్సులోనే ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. ఈ క్యాన్సర్‌ను అత్యంత ఖచ్చితత్వంతో ముందస్తుగా గుర్తించడం కోసం ఏఐ- ఆధారిత హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ క్లినిక్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. 

చికిత్సకు నిర్ణయాత్మక మార్పు

యశోద హాస్పిటల్స్ -హైటెక్ సిటీ, క్లినికల్ డైరెక్టర్, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చినబాబు సుంకవల్లి మాట్లాడుతూ.. ఈ ఏఐ- ఆధారిత హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ క్లినిక్ సాంప్రదాయ ప్రోటోకాల్స్ నుంచి జీవశాస్త్రం -ఆధారిత, రోగి-నిర్దిష్ట చికిత్సకు నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందన్నారు. ఈ ఆంకాలజీ వైద్య శాస్త్రంలో ప్రపంచ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఉంటుందని, తెలంగాణా రాష్ట్ర ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ సమ్మిట్‌లో అంతర్జాతీయ ప్రఖ్యాత అధ్యాపకులు డాక్టర్. జతిన్ పి. షా, డాక్టర్. అనిల్ కె. డి’క్రూజ్ పాల్గొన్నారు. 500 మందికి పైగా ఆంకాలజీ వైద్య నిపుణులు చికిత్స వ్యూహాలు, మల్టీమోడల్ చికిత్స ప్రణాళికపై నిపుణుల నేతృత్వంలో లోతైన చర్చ జరిగినట్లు డాక్టర్ చినబాబు సుంకవల్లి తెలిపారు.