calender_icon.png 1 February, 2026 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండి ధర ఢమాల్!

01-02-2026 02:20:41 AM

  1. రికార్డు స్థాయిలో పతనం 
  2. ఒక్కరోజే రూ.లక్ష తగ్గిన సిల్వర్
  3. మార్కెట్‌లో ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర రూ. 2,85,156
  4. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులే కారణం

హైదరాబాద్, జనవరి 31: వెండి ధర కొం డ దిగుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే  రికార్డు స్థాయిలో వెండి కిలో ధర దాదాపు లక్ష రూపాయలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారిగా వెండి ధర ఢమాల్ మని పడిపోయింది. మార్కెట్లో  ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర రూ. 2,85,156 వద్ద లభిస్తోంది. రెండు రోజుల క్రితం 4 లక్షల రూపాయలు పలికిన వెండి ధర ఒక్కరోజులోనే దాదాపు లక్ష రూపాయలు పైనే తగ్గింది.

నిన్న ఒక్కరోజే మార్కెట్లో వెండి ధర 93,684 రూపాయలు తగ్గినట్లు తెలుస్తోంది. వెండి ధర నిజానికి అంతర్జాతీయ మార్కెట్లలో ఒక ఔన్స్ సిల్వర్ 85 డాలర్లకు తగ్గింది. ఒక్క రోజులోనే 31 డాలర్లు తగ్గింది. ఒకే రోజు వెండి ధర ఇంత తగ్గడం చరిత్రలోనే తొలిసారి. దాదాపు 20 శాతం పైన లాభాలు తుడిచిపెట్టుకొని పోయాయి.

ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరణతోనే..

సిల్వర్ ధర తగ్గడానికి ప్రధాన కారణం ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరణ చేసుకోవడమే కారణంగా చెబుతున్నారు. నిజానికి సిల్వర్ ధర ఈనెల ప్రారంభం నుంచి  దాదాపు ప్రతిరోజు పెరుగుతూ రెండింతలు అయింది. ఒకే నెలలో దాదాపు లక్షన్నర పైనే పెరిగింది. అయి తే సిల్వర్ ధర తన వాస్తవ విలువ కన్నా కూడా అధికంగా పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడితే వెండి ధర భారీగా తగ్గుతుందని అంచనా వేశారు. వెండి ధర పెరగడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్ కాగా, అంతకుమించి సేఫ్ పెట్టుబడిగా ఇన్వెస్టర్లు వెండిని కూడా బంగారంతో సమానంగా భావించడంతోనే ధరలు భారీగా పెరిగాయని అంచనా వేస్తున్నారు. 

మరికొంత తగ్గుతుందని..

పరిస్థితులు ఇలానే కొనసిగితే  వెండి ధర మరింత భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అం తర్జాతీయ మార్కెట్లో మాత్రం ఇప్పటికీ కూడా వెండికి ఇండస్ట్రియల్ పరంగా డిమాండ్ ఉన్న సంగతి గుర్తించాల్సిందే. ఎందుకంటే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలోనూ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలోనూ వెండి వాడకం అనేది పెరుగుతుంది. ఈ కారణంగానే వెండి ధరలు భారీగా మార్కెట్లో పెరుగుతున్నాయి. వెండికి ప్రత్యామ్నాయంగా మరొక లోహాన్ని కనుక గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో రీప్లేస్ చేసినట్లయితే వెండి ధర మరింత తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దిగొస్తున్న బంగారం ధర

తులం బంగారం రూ.1,60,580.. నిన్నటికంటే రూ.8,620 తక్కువ

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లవైపు పెట్టుబడి దారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా బంగారం ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. శనివారం ఉద యం హైదరాబాద్ మార్కెట్లో తులం (24 క్యారె ట్స్ 10గ్రాములు) బంగారం ధర రూ. 1,60,580గా ఉంది.. నిన్నటి ధరకంటే ఒక్కరోజే 8,620 రూపాయలు తగ్గుముఖం పట్టింది.

ధరల తగ్గుదలకు అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకస్మిక మార్పునకు అమెరికాలోని టెక్నాలజీ రం గం కూడా కారణమైంది. కృత్రిమ మేధస్సు (ఏఐ)పై భారీగా ఖర్చు చేస్తున్న మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు కుప్పకూలా యి. క్లౌడ్ వృద్ధి మందగించడం, ఏఐ ఖర్చు లు పెరగడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ఈ ప్రభావం కమోడిటీ మార్కెట్లపై పడింది. మదుపరులు తమ నష్టాలను పూడ్చుకోవడానికి బంగారం, వెండిలోని పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.