03-11-2025 02:00:54 PM
హైదరాబాద్: చేవెళ్ల సీహెచ్‌సీలో మృతుల కుటుంబాలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Health Minister Damodar Raja Narasimha) పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా శవపరీక్షలు పూర్తి చేసి, కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఒక్కరికి మాత్రమే హెడ్ ఇంజూరి అయిందని, మిగిలిన పేషెంట్లందరి కండీషన్ స్టేబుల్‌గా ఉందని డాక్టర్లు మంత్రికి వివరించారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించిన మంత్రి వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. క్షతగాత్రులను మంత్రి రాజనర్సింహ పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. బస్సు కండక్టర్‌తో మాట్లాడి యాక్సిడెంట్ జరిగిన తీరును తెలుసుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలో(Rangareddy district) చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో(Road Accident) బస్సు, లారీ డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై పర్యవేక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేరుకున్నారు. కాగా, ఇప్పటికి 14 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని, మిగిలిన మృతదేహాలకు గంటలో శవపరీక్షలు పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతుందని, పూర్తి నివేదిక వచ్చాక అన్ని విషయాలు చెబుతామని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు.