8 June, 2026 | 2:43 AM

ఆహారంతోనే ఆరోగ్య భద్రత

08-06-2026 12:47 AM

నిర్మల్, జూన్ 7 (విజయక్రాంతి): అంగన్వాడీలలో నాణ్యమైన పోషకాహారం అందించాలని జిల్లా ఆహార భద్రత అధికారి సునీత అన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక‘, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఆహార భద్రతాధికారి సునీత మాట్లాడుతూ, సమాజంలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో సరఫరా చేసే ఆహార పదార్థాల నిల్వ, వంట తయారీ విధానాలలో పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు.

పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో భాగంగా, జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన ఆహార నియమాలు అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, భవిష్యత్తులోనూ ఇలాంటి మరిన్ని అవగాహన కార్యక్రమాల ద్వారా జిల్లాను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, అంగన్వాడి టీచర్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.