01-05-2025 01:10:31 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): జనగణనలో కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం అభినందనీయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కులగణన విషయంలో మొదట కాంగ్రెస్ అధినేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కులగణన విషయంలో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చామని, అలాగే విషయంలో మొదట రాహల్ గాంధీకి అభినందనలు చెప్పాలని హైదరాబాద్ లోని తన జూబ్లీహిల్స్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కొనియాడారు. దేశంలోని అనేక పార్టీలు కులగణన కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించాయని చెప్పారు. కులగణన నిర్ణయం తీసుకున్న కేంద్రానికి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కులగణన విషయంలో కేంద్రమంత్రుల కమిటీ ఏర్పాటు చేసి, కమిటీలో కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులను నియమించాలని కోరారు.
తెలంగాణలో బీసీలుగా ఉన్న బోయలు, కర్ణాటకలో మరో వర్గంలో ఉన్నారని, తెలంగాణలో 8 పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా తాము వివరాలు సేకరిస్తే అనేక సూచనలు, సలహాలు వచ్చాయన్నారు. కులగణన విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందని, ఎన్యుమరేటర్ నుంచి సీఎస్ వరకు పలుసార్లు సమీక్ష చేశామని సీఎం వివరించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం.. ఆన్ లైన్ లో నమోదుకు అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కులగణన చేపట్టామని, కులగణనలో తెలంగాణ మోడల్ తీసుకోవాలని, అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీని పంపాలని కేంద్రానికి విజ్ఞాప్తి చేశారు.ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సూచనలు, సలహాలు తీసుకున్నామన్నారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ చెప్పినట్లు సీఎం మరోసారి గుర్తు చేశారు. కులగణనలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలని, సర్వే పూర్తయ్యాక ఏం చేస్తారో కూడా ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు.
జనగణనలో కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రజలు ప్రజా ప్రభుత్వానికి అధికారించారని రేవంత్ రెడ్డి వివరించారు. కులగణనపై ప్రజాసంఘాల ప్రతినిధులను సంప్రదించే ప్రశ్నపత్రం తయారు చేశామని, రాష్ట్రంలోని బలహీనవర్గాల తరపున రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. కులగణనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబుతో కమిటీ వేశామని ముఖ్యమంత్రి చెప్పారు. కులగణన, బీసీలకు 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరామని, ఈ అంశాలపై అసెంబ్లీలో రెండు తీర్మాణాలు చేశామన్నారు. ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఎప్పుడు పూర్తి చేస్తారో తేదీలు నిర్ణయించాలని, కులగణన చేసేముందు వచ్చే సవాళ్లపై అన్ని రాష్ట్రాలోని పార్టీలు, ప్రజాసంఘాలతో నిపుణుల కమిటీ విస్తృతంగా చర్చించాలని సీఎం డిమాండ్ చేశారు. కులగణన విధివిధానాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని, ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నారు.
తెలంగాణలో నిర్వహించిన కులగణనలో అన్ని పార్టీలనూ భాగస్వాములను చేశామని, ఈ విషయంలో తామ అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకుంటామని రేవంత్ రెడ్డి సూచించారు. నివేదిక తయారు చేశాక పేదలకు లబ్ధి జరగాలని, ఆలస్యమైన కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని, దానిని స్వాగతిస్తున్నామన్నారు. కులగణన విషయంలో కేంద్రంపై విమర్శలు చేయడం నాకిష్టం లేదని పేర్కొన్నారు. దేశంలో జనాభా లెక్కలను 2021 నుంచి వాయిదా వేస్తున్నారని, ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముందుగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న రిజర్వేషన్లు పరిశీలించాలని, గతంలో బీసీలో ఉన్నవారు ఇప్పుడు ఓసీలోకి వచ్చారని చెప్పారు. కులగణన సమాచారంతో సంక్షేమ పథకాల అమలు సులభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.