calender_icon.png 1 May, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేవ్స్ సమ్మిట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

01-05-2025 02:21:09 PM

ముంబయి,(విజయక్రాంతి): ముంబయి వేదికగా జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రపంచ మీడియా పవర్‌ హౌస్‌గా భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు భారత ప్రభుత్వం కనెక్టింగ్‌ కంట్రీస్‌' అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. ఈ వేవ్స్ సమ్మిట్ కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీ మాట్లాడుతూ... భారత్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మారుతుందని అన్నారు. సృజనాత్మక హబ్ గా తయారై కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలని, సంప్రదాయ, నవతరాలను సమన్వయం చేయాలని పేర్కొన్నారు.

మన దేశంలో 1913లో తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైందని, గేమింగ్ రంగంలో యువతకు అనేక అవకాశాలున్నాయని ప్రధాని తెలిపారు. 50 దేశాల గాయకులు కలిసి వైష్ణవ జనతో గీతం ఆలపించారని, ప్రతిభ, సృజనాత్మకతల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతకు అభినందనలు తెలియజేశారు. సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి అని, కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహిస్తామని మోదీ వెల్లడించారు. ప్రభుత్వం తరుపున త్వరలో వేవ్స్ అవార్డులు కూడా ఇవ్వబోతున్నామని, ఈ అవార్డులు ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భారతదేశంలో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయని, ఒక్కో ఊరికి ఒక్కో కథ, ప్రతి వీధి ఒక కథ ఉంటుందన్నారు.

 ప్రతి పర్వతం ఒక పాట పాడుతుందని, ప్రతి నదీ ఒక గేయం ఆలపిస్తుందని, శివుడి ఢమరుకం సృష్టిలోని తొలి శబ్ధామని వ్యాఖ్యానించారు. సరస్వతి వీణానాదం తొలి లయకారమని, మన దేశం అనేక విభిన్న సమాజాల సమాహారమని వివరించారు. ఇప్పుడు భారత్ అన్ని విషయాల్లో ప్రపంచ దశాల దృష్టిని ఆకర్షిస్తోందని, మన దేశంలో వేల ఏళ్లనాటి కథల ఖజానా ఉందని, మన కథల్లో కల్పన, చరిత్ర, సైన్స్, అన్ని ఉన్నాయన్నారు. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతుందని,  దేశంలో ఇలాంటి సదస్సు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 

వేవ్స్ సమ్మిట్ 2025 (కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్) తో 100 కి పైగా దేశాల నుంచి కళాకారులు, సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఒకే గొడుగు కిందకు వచ్చారని ప్రధాని మోదీ అన్నారు.. WAVES సమ్మిట్‌ సృజనాత్మకత కేంద్రంగా అభివర్ణించారు. కాగా.. ఈ వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ లో బాలీవుడ్, టాలీవుడ్ సహా.. భారత సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రనటులు, పలువురు వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.. ఈ సమ్మిట్‌లో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ , రణ్‌బీర్ కపూర్ , దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ సహా ఇతర ప్రపంచ తారలు పాల్గొన్నారు.