21 April, 2026 | 1:58 AM

సేవలందించడమూ ఒక బాధ్యత

21-04-2026 12:00 AM

(నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం)

ఏటా ఏప్రిల్ 21న జరుపుకొనే జాతీయ పౌర సేవల దినోత్సవం.. సివిల్ సర్వీసుల సేవలను గౌరవించడమే కాదు, ప్రజల ప్రాథమిక అవసరాలను సమర్థవంతంగా అందించాలనే లక్ష్యాన్ని గుర్తుచేసే రోజు. ముఖ్యంగా ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి మౌలిక అవసరాలను ప్రతి పౌరునికి చేరవేయడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత. దేశ అభివృద్ధిని కేవలం ఆర్థిక వృద్ధితో కొలవలేం. ప్రతి పౌరుడు కనీస జీవన ప్రమాణాలు పొందుతున్నాడా లేదా అన్నదే నిజమైన అభివృద్ధికి సూచిక.

ఈ నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడటం వారి బాధ్యత. ప్రభుత్వాలు పేదలకు గృహ వసతి కల్పించేందుకు అనేక పథకాలను తీసుకొస్తున్నాయి. అయితే, వాటి అమలులో ఆలస్యం, అవినీతి, ఎంపికలో లోపాలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ లోపాలను అధిగమించి, నిజంగా అవసరమైన వారికి ఇల్లు అందేలా చేయడం సివిల్ సర్వెంట్లు చేయాల్సిన నిజమైన సేవ.

ఆహారం విషయంలో కూడా దేశం పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉచిత ఆహార పంపిణీ పథకాలు ఉన్నప్పటికీ, చాలామంది ఆకలితో బాధపడుతున్నారు. సరఫరా వ్యవస్థలో లోపాలు, మధ్యవర్తుల దుర్వినియోగం వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులను మెరుగుపరచడం కోసం సివిల్ సర్వెంట్లు చురుగ్గా పనిచేయాలి.

అయితే, ఈ లక్ష్యాల సాధనలో అనేక అడ్డంకులు ఉన్నాయి. పరిపాలనా లోపాలు, రాజకీయ ఒత్తిళ్లు, వనరుల కొరత వంటి సమస్యలు సివిల్ సర్వెంట్ల పనిని ప్రభావితం చేస్తున్నాయి. డిజిటల్ యుగంలో సేవల పంపిణీ మరింత పారదర్శకంగా, వేగంగా మారింది. జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వెంట్లు తమ బాధ్యతలను పునఃపరిశీలించాలి. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం విధి కాకుండా ఒక నైతిక బాధ్యతగా భావించాలి. 

 ఎల్లబోయిన వెంకటేశ్వర్లు 

8184940814