19-05-2024 02:02:51 AM
చెరువును తలపిస్తున్న రహదారులు
లింగంపల్లిలో అత్యధికంగా 6.8 సెం.మీ వర్షపాతం
హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, మే 18 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కొద్ది రోజులుగా వర్షం వెంటాడుతోంది. ఉదయం అంతా సాధారణ వాతావరణం ఉండి, సాయంత్రం వేళ మాత్రం భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకస్మాత్తుగా వర్షం రావడం రావడమే దంచికొడు తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలలో భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఈ సమయంలో మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
వరద నీటిలో పలు వాహనాలు చిక్కుకుపోతున్నాయి. శనివారం కురిసిన వర్షంతో గత రెండు వారాల్లోనే నగర ప్రజలు మూడోసారి భారీ వర్షాన్ని చూడాల్సి వచ్చింది. శనివారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఇళ్లలోకి వరదనీరు చేరడంతో నీళ్లను బయటకు తోడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వర్షంతో పాటు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈ సమయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయడంతో వరద నీటిని క్లియర్ చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు.
చెరువును తలపిస్తున్న రహదారులు
నగరంలో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి, నిజాంపేట, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, ప్రగతినగర్, దుండిగల్, గండిమైసమ్మ, జగద్గిరి గుట్ట, చింతల్, ఎర్రగడ్డ, తుకారం గేటు, మెట్టుగూడ, తార్నాక, కొత్తపేట, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, మేడ్చల్, కండ్లకోయ తదితర ప్రాంతాలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
దీంతో రహదారులన్నీ నీట మునిగాయి. వనస్థలిపురం, చింతలకుంట, లింగంపల్లిలోని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాంతాలు విజయవాడ ప్రధాన రహదారి వెంబడి ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వనస్థలిపురం, చింతలకుంట వద్ద రోడ్డుపై వరద నీరు చేరిన కారణంగా వాహనదారులు తమ వాహనాలను నీళ్లల్లోంచి తోసుకుపోవాల్సి వచ్చింది. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలకు గంట వ్యవధిలోనే 16 చోట్ల చెట్లు కూలిపోవడం, 21 ప్రాంతాలలో వరద నీరు నిలిచినట్టుగా ఫిర్యాదులు అందాయి.
లింగంపల్లిలో 6.8 సెం.మీ వర్షపాతం
శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లింగంపల్లిలో అత్యధికంగా 6.8 సెంటి మీ టర్ల వర్షపాతం నమోదు అయ్యింది. చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద 5.8, హస్తినా పురంలో 4.6, రామాంతాపూర్‌లో 4.5, నాగో ల్ లో 3.9, గచ్చిబౌలిలో 3.8, ప్రశాంత్‌నగర్‌లో 3.7, ఉప్పల్‌లో 3.6, సైదాబాద్‌లో 3.4, పటాన్‌చెరులో 3.3, ఓయూలో 3.1, సరూర్ నగర్‌లో 3.0, హబ్సీగూడలో 2.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.