19-05-2024 02:01:49 AM
రూ.10 లక్షలు వసూలు.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (విజయక్రాంతి) : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి ప్రాంతానికి చెందిన సూర్యదేవర అనిల్ కుమార్(34) ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యాప్రాల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. నగరానికి చెందిన షేక్ హుస్సేన్‌కి పాట్నాలో ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అతని వద్ద రూ.10 లక్షలు వసూలు చేశాడు.
అనిల్ మాటలు నమ్మిన షేక్‌హుస్సేన్ ఉద్యోగంలో చేరడానికి పాట్నా వెళ్లగా.. ఉద్యోగంలో చేరడానికి ఇంకా సమయం ఉందని నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాడు. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం గురించి గట్టిగా నిలదీయగా.. సికింద్రాబాద్ రైల్వేలో టీటీఈ ఉద్యోగం ఉందని, టీటీఈ నవీన్ దగ్గర 6 నెలల ట్రైనింగ్ ఉంటుందని మరోసారి నమ్మించాడు. అనిల్ కుమార్‌ని ఎన్నిసార్లు ఉద్యోగం గురించి ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అనిల్ కుమార్ గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్టు, అతనిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.