జడ్చర్లలో భారీ వర్షం.. జనం అతలాకుతలం
- - నేతాజీ చౌరస్తా వద్ద ట్రాఫిక్
- భారీ వర్షంలో తడుస్తూనే పరిస్థితి సమీక్షిస్తూ ట్రాఫిక్ ను నియంత్రించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 12 (విజయ క్రాంతి) : జిల్లా వ్యాప్తంగా గురువారం భారీగా వర్షం కురిసింది. జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. ఈ కారణంగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న వెంటనే జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి తక్షణమే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే గారు, వరద నీటిని రహదారికి పక్కకు మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాక, ట్రాఫిక్ నియంత్రణలో స్వయంగా పాల్గొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అయ్యాక పట్టణంలో వర్షపు నీరు నిలకడ లేకుండా సజావుగా వెళ్లిపోడానికి అవసరమైన స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మించేందుకు రూ.14 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందనీ, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయనివెల్లడించారు






