calender_icon.png 27 September, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ మహోగ్రం.. హైదరాబాద్ అతలాకుతలం

27-09-2025 09:11:24 AM

నిండుకుండలా జంట జలాశయాలు.

గేట్లు ఎత్తడంతో పోటెత్తిన వరద.

రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ సిటీ బ్యూరో,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు హైదరాబాద్ నగరం(Hyderabad city) జలదిగ్బంధంలో చిక్కుకుంది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట పూర్తిస్థాయిలో నిండిపోవడంతో, అధికారులు గేట్లను ఎత్తి భారీగా వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. దీంతో దశాబ్దాల తర్వాత మూసీ నది ఉగ్రరూపం దాల్చి, ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహానికి పురానాపూల్, అఫ్జల్‌గంజ్, గౌలిగూడ, చాదర్‌ఘాట్ సహా పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

నీట మునిగిన చారిత్రక కట్టడాలు.. ఎంజీబీఎస్‌కు జలదిగ్బంధం..

మూసీ వరద ఉధృతికి పురానాపూల్‌లోని హిందూ శ్మశానవాటిక, చారిత్రక శివాలయం పూర్తిగా నీట మునిగాయి. పురానాపూల్ బైపాస్ రోడ్డుపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఇక, రాష్ట్రానికే తలమానికమైన మహాత్మాగాంధీ బస్ స్టేషన్(Mahatma Gandhi Bus Station) ఎంజీబీఎస్ ను అర్ధరాత్రి వరద నీరు చుట్టుముట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలను స్వయంగా సమీక్షించారు. బస్టాండ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే వరకు అధికారులకు ఫోన్లో సూచనలు ఇస్తూనే ఉన్నారు. మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను చూసేందుకు పురానాపూల్, నయాపూల్ బ్రిడ్జిలపైకి ప్రజలు భారీగా చేరుకున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి లోనవుతూ, తమ సెల్‌ఫోన్లలో వీడియోలు, సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా, పోలీసులు బ్రిడ్జిలపై ఉన్న చిరు వ్యాపారులను ఖాళీ చేయించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హైడ్రా సిబ్బంది మూసీ ప్రధాన ద్వారాల వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు..

రాష్ట్రంలో వరుస వర్షాలు, పండుగల సీజన్ కావడంతో ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. మూసీ పరివాహకంలోని(Musi River) లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, ఎంజీబీఎస్‌కు(MGBS) వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. నగరంలో మరో రోజు భారీ వర్ష సూచన ఉన్నందున జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, విద్యుత్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. నీరు నిలిచే ప్రాంతాల్లో, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, అటువైపు రాకపోకలను నియంత్రించాలని ఆదేశించారు.