27-09-2025 09:38:05 AM
"గర్జిస్తున్న" మూసీ "కత్వలు"
అప్రమత్తమైన రెవెన్యూ, పోలీస్ అధికారులు
వలిగొండ,(విజయక్రాంతి):గత రెండు మూడు రోజులుగా మూసీ ఎగువ ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో(Heavy Rains) మూసీ మహోగ్రరూపం దాల్చింది. దీనికి తోడు హైదరాబాదులోని పలు జలాశయాలు ప్రమాదకర స్థాయి చేరుకోవడంతో నీటిని మూసీలోకి వదులుతుండడంతో అగ్నికి వాయువు తోడైనట్టు మూసీలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో మూసీ(Musi River ) జడలు విప్పుకొని తన విశ్వరూపం చూపిస్తూ దూకుడుగా ముందుకు సాగుతుంది. మూసీ ప్రవాహంతో వలిగొండ మండలంలోని భీమలింగం, నెమలికాలువ కత్వలు పోటెత్తిన వరదతో గర్జిస్తున్నాయి. మూసీ వరద ఉద్ధృతితో సంగెం-బొల్లేపల్లి వేములకొండ-లక్ష్మాపురం లోలెవెల్ కాజువేల పైనుండి భారీ వరద నీరు పారుతుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ వరద ప్రవాహంతో రెవిన్యూ, పోలీస్ శాఖలు అప్రమత్తమయ్యాయి.