సీఎంసీ భవన నిర్మాణానికి హైకోర్టు బ్రేక్
మియాపూర్ స్థలంపై స్టేటస్ కో ఆదేశం
రూ.161 కోట్ల ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకం
శేరిలింగంపల్లి, జూలై 13 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) నూతన ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం తొలి దశలోనే న్యాయపరమైన అడ్డంకుల్లో చిక్కుకుపోయింది. మియాపూర్లో రూ.161 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని భావించిన ఈ మెగా ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేయడంతో పనులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి.
ఐటీ కారిడార్లో అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా ఈ భవనాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల వైభవంగా శంకుస్థాపన చేశారు. సైబరాబాద్ వేగవంతమైన అభివృద్ధికి ఈ భవనం కీలకమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే శంకుస్థాపన ముగిసిన కొద్ది రోజుల్లోనే భూమి యాజమాన్య హక్కుల వివాదం తలెత్తింది.ప్రైవేటు వ్యక్తుల కోర్టు అప్రోచ్... ఈ స్థలం తమదని కొందరు ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ వరకు భూమిపై ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టవద్దని, యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే నిర్మాణ పనులను నిలిపివేశారు. దీంతో రూ.161 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.ప్రభుత్వం రెండు దిక్కులా కసరత్తు...ఈ నేపథ్యంలో అధికారులు రెండు వైపులా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఒకవైపు మియాపూర్ లేదా సమీప ప్రాంతాల్లో వివాదాలు లేని ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషణ జరుపుతున్నారు. మరోవైపు ఇదే స్థలంలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు న్యాయ నిపుణులతో అత్యవసర సంప్రదింపులు చేస్తున్నారు. వచ్చే హైకోర్టు విచారణలో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై సీఎంసీ భవన భవితవ్యం ఆధారపడి ఉంది.ఈ అభివృద్ధి పనుల ఆలస్యం సైబరాబాద్ పరిధిలోని పౌర సేవలపై ప్రభావం చూపవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా సమస్యను పరిష్కరించి, ప్రాజెక్టును ముందుకు నడిపించాలని వారు కోరుతున్నారు.






