శివాజీ గణేశన్ ఇల్లు జప్తునకు హైకోర్టు ఆదేశం
చెన్నైలోని ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ ఉన్న విశాలమైన ఇంటిలో కొంత భాగాన్ని అటాచ్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. శివాజీ గణేశన్ మనవడైన నటుడు దుష్యంత్, అతని భార్య అభిరామి తీసుకున్న అప్పుల కేసులో ఈ తీర్పు వెలువడింది. ఈ దంపతులు భాగస్వాములుగా ఉన్న నిర్మాణ సంస్థ ఈసన్ ప్రొడక్షన్స్.. తమిళ చిత్రం ‘జగజాల కిల్లాడి’ని నిర్మించింది. ఇందుకోసం వారు ధనభాగ్యం ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ.3.74 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ జంట తమ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చలేదు. ఈ కేసులో విశ్రాంత న్యాయమూర్తి రవీంద్రన్‌ను చెన్నై హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది.
జస్టిస్ రవీంద్రన్.. 2024, మే 4న ‘జగజాల కిల్లాడి’ సినిమాకు సంబంధించి హక్కులన్నీ ధనభాగ్యం మేనేజింగ్ డైరెక్టర్‌కు అప్పగించాలని, రూ.9.2 కోట్ల రుణ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి పొందేందుకు వీలు కల్పించాలని ఆదేశించారు. సినిమా రైట్స్ తమకు అప్పగించాలని ధన్యభాగ్యం కోరగా, చిత్ర నిర్మాణం పూర్తి కాలేదని నిర్మాతలు తెలిపారు. దీంతో ధనభాగ్యం మరోమారు పిటిషన్ దాఖలు చేసింది. దీంతో శివాజీ గణేశన్ ఇంటి లో కొంత భాగాన్ని జప్తు చేయాలని న్యాయమూర్తి అబ్దుల్ ఖుద్దోస్ ఆదేశించారు. సమయం ఇవ్వాలని కోరిన ఈసన్ ప్రొడక్షన్స్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదు. అందుకే కేసును మార్చి 5వ తేదీ.. బుధవారానికి వాయిదా వేశారు.






