శంషాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత
- బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై రైతుల ఆగ్రహం
- సబితాఇంద్రారెడ్డి కాళ్లపై పడ్డ బాధితులు
- శనివారం ఘటనలో 36 మందిపై కేసులు నమోదు!
శంషాబాద్, జూలై 19(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలో భూసేకరణ వ్యవహారం ఆదివారం కూడా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అర్ధరాత్రి పోలీసుల ఉక్కుపాదం మోపారు. ఆందోళన శిబిరంలోని టెంట్లను బలవంతంగా తొలగించి, రైతులను వేరే ప్రాంతాలకు తరలించారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాళ్లపై మహిళలు, రైతులు పడి విలపించారు.
‘మా భూములను మీరే రక్షించాలి’ అని వేడుకున్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో మొత్తం 36 మందిపై కేసులు నమోదు చేశారు. ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, ఆర్టీసీ బస్సు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవడంతో స్థానిక రైతులు కొద్దిరోజులుగా నిరసనలు తెలుపుతుండడం, శనివారం వేకువజామున పోలీసులు, హైడ్రా అధికారులు ఆందోళన శిబిరాలపై ఉక్కుపాదం మోపడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బహదూర్గూడకు ఆదివారం వచ్చారు. ఆమె వాహనం దిగగానే వందలాది మంది మహిళలు, రైతులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ‘అమ్మా.. తరతరాలుగా నమ్ముకుని సాగు చేసుకుంటున్న మా భూములను రక్షించండి.. ఈ పెద్ద ఆపద నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి’ అంటూ తీవ్ర భావోద్వేగంతో కన్నీరు మున్నీరవుతూ ఆమె కాళ్లపై పడ్డారు.
భూములు కోల్పోతే తాము రోడ్డున పడతామని చేతులు జోడించి వేడుకున్నారు. రైతుల ఆవేదనను ఆలకించిన సబితా ఇంద్రారెడ్డి వారిని ఓదార్చి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. న్యాయ బద్ధంగా రైతులకు దక్కాల్సిన భూములను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. ఇదిలా ఉంటే శనివారం ఘటనలో మొత్తంగా 36 మందిపై కేసులు నమోదు కాగా, వీరిలో పటోళ్ల కార్తిక్‌రెడ్డి, పంతంగి భూపాల్‌రెడ్డి, మహేందర్, కోలన్ ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.






