3 May, 2026 | 1:29 AM

జీవో 7 తీసుకురావడం తగదు

03-05-2026 12:00 AM
  1. గతంలో లాగానే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి
  2. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి 

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో  ప్రభుత్వం జీవో 7 తీసుకురావడం కరెక్ట్ కాదని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టీ.జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నేరుగా కళాశాలలకు చెల్లించే స్తోమత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ఆర్థిక భారం మీరే భరించాలని ప్రభుత్వం అంటున్నదని, అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

కేసీఆర్ మీద కోపం ఉన్నట్టుతై ఈ పథకం ప్రారంభించింది వైఎస్సార్‌ అని, ఆయన కోసం అయిన కొనసాగించాలని సూచించారు. రేవంత్ రెడ్డికి నిరుపేద వర్గాలు అంటే ఎందుకు అంత కక్ష అని, రాజ్యంగా నిబంధనలు పాటించడం నీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. విద్యా, వైద్యం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అని, వైద్యానికి సంబంధించి కూడా కేసీఆర్ ఆరోగ్య శ్రీని మరింత పటిష్టం చేశారని, తెలంగాణ ఏర్పాటు అయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో వైద్య విద్యా కాలేజ్‌లు ఏర్పాటు చేశారని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు.

టీమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారని, అవి అన్నీ త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. గతం కంటే మెరుగైన పాలన కొనసాగించాలి.. కాని రేవంత్ రెడ్డికి అది సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు ఇబ్బందికి కలిగించే జీవో 7ను వెంటనే ఉపసంహ రించుకోవాలని, గతంలో లాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 1994 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ఇప్పుడు మళ్లీ పడుతుందని, ఆనాడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని గుర్తు చేశారు. ‘రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే డిమాండ్ ప్రజల్లో నుంచి వస్తుందని, దీనిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.