12-11-2025 12:00:00 AM
తెలంగాణ చరిత్రలో కాకతీయుల యుగం ఒక సువర్ణయుగం. ఆ కాలంలో నిర్మించిన దేవాలయాలు, గోపురాలు, కోటలు, బావులు ఆ కాలపు శిల్పకళా ప్రతిభకు నిదర్శనాలు. ఇటీవల కాకతీయుల కాలానికి చెందిన ఒక పురాతన బావి పునరుద్ధరించబడింది. దీనిని మెట్ల బావి లేదా శృంగార బావిగా పిలిచేవారు. ఈ బావి శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై మట్టిలో కూరుకుపోయింది. తాజాగా పురావస్తు శాఖ అధికారులు దీనిని పునరుద్ధరించారు.
స్థానిక ప్రజల సహకారంతో బావిని శుభ్రపరిచి, అక్కడున్న శిల్పాలను పునరుద్ధరించారు. ఈ బావి కేవలం నీటి వనరుగానే కాకుండా ఆ కాలపు ప్రజల సాంస్కృతిక నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. బావిలోని రాతి బండలపై చెక్కిన కళాత్మక నమూనాలు కాకతీయుల కాలపు ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాకతీయుల కాలంలో చరిత్ర పుటల్లో దాగి ఉన్న సంపద. కాకతీయులు నిర్మించిన అనేకమైన దేవాలయాలు, అనేక శిల్పాలు ఈ తరానికి కూడా చూడడానికి ఎంతగానో ప్రీతికరంగా ఉన్నాయి.
ఢిల్లీ సుల్తానుల దురాక్రమణాల వలన కాకతీయులు నిర్మించిన ఎన్నో కళా వైభవాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ పాలంపేటలోని రామప్ప దేవాలయం, హనుమకొండలోని వేయి స్తంభాల గుడి.. నేటి తరానికి కనులవిందుగా దర్శనమిస్తునే ఉన్నాయి. మన రాజులు చేపట్టిన చారిత్రక నిర్మాణాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంతో పాటు ప్రజలపై కూడా ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.
శ్రీనివాస్, చొప్పదండి